బుల్లి తెరపై యాంకర్‌గా క్రేజ్‌ను దక్కించుకున్న ఓంకార్ ‘జీనియస్’ మరియు ‘రాజుగారి గది’ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.అందులో మొదటి చిత్రం ‘జీనియస్’ పెద్దగా ఆకట్టుకోలేదు.
అయితే ‘రాజుగారి గది’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు రెట్ల లాభాలను తెచ్చి పెట్టిందనే టాక్ వచ్చింది.
దాంతో ఓంకార్ తన తర్వాత చిత్రాన్ని ‘రాజుగారి గది’ చిత్రాన్ని సీక్వెల్‌గా రూపొందించబోతున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.అందుకోసం ఓంకార్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు అని, అంజలితో సంప్రదింపులు జరిపాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.
తాజాగా ఓంకార్ స్పందిస్తూ… తాను ఇప్పటి వరకు తన తర్వాత సినిమాపై ఒక క్లారిటీకి రాలేదు అని, ఏ చిత్రం చేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని అన్నాడు.
‘రాజుగారి గది’ సీక్వెల్ చేసే ఆలోచన అయితే ఉంది కాని, ఇప్పటి వరకు అందుకు కనీసం స్టోరీ లైన్ సైతం అనుకోలేదు అని, మరో వైపు ఒక కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నాను.ఈ రెండులో ఏది చేస్తాను అనేది త్వరలో చెప్తాను అంటూ ఓంకార్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఓంకార్ నిర్మాణంలో వచ్చిన ‘జతకలిసే’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాతో నిర్మాతగా ఓంకార్ భారీ లాభాలనే దక్కించుకున్నాడు.
దాంతో భవిష్యత్తులో వరుసగా ఇతర దర్శకుల దర్శకత్వంలో సినిమాలు నిర్మిస్తాను అంటున్నాడు.తన దర్శకత్వంలో సినిమాను ఇతర నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.