ఉపాసనా...కొంచెం మీ ఆయనకు చెప్పండి అంటూ రామ్ చరణ్ కు ఛాలెంజ్ విసిరిన హీరో!       2018-05-31   20:24:17  IST  Raghu V

ప్రస్తుతం సెలబ్రిటీలంతా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు చేస్తున్నారు.. మరొకరికి దాన్ని విసిరే పనిలో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీకి రాథోడ్ సవాల్ విసిరారు. దీంతో వారు ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి తాము ఫిట్‌నెస్ కోసం చేస్తున్న కసరత్తుల వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వారు మరికొంత మందికి ఫిట్‌నెస్ సవాళ్లు విసిరారు.

ఇది అలా అలా పాకుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దకు చేరింది. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్.. తారక్‌, సూర్య, పృథ్వీరాజ్‌‌లకు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసిరారు. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్.. తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పెట్టారు. ఆయన కూడా కొంత మందికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

-

తన అన్న నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు. అయితే వీళ్లలో రాంచరణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు. దీంతో ఆయన సతీమణి ఉపాసనను ట్యాగ్ చేసి ‘చరణ్‌కు మీరు చెప్పండి’ అని పేర్కొన్నారు.