తేజ చెప్తే వద్దన్నాడు, క్రిష్‌ చెప్తే సరేనన్నాడు!       2018-06-25   03:48:05  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘ఎన్టీఆర్‌’ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ చిత్రానికి తేజను దర్శకుడిగా అనుకున్నారు. తేజ స్క్రిప్ట్‌ వర్క్‌లో కూడా పాల్గొన్నాడు. తనదైన మార్క్‌తో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్న సమయంలోనే బాలకృష్ణతో చిన్న విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. దాంతో తేజ స్వయంగా తాను ఎన్టీఆర్‌ మూవీ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తేజ ఈ చిత్రం నుండి తప్పుకున్న తర్వాత క్రిష్‌ ఈ చిత్రంలో ఎంట్రీ ఇచ్చాడు.

దర్శకుడు తేజ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని బాలకృష్ణకు తెలియజేయగా, రెండు పార్ట్‌లు అవసరం లేదని, ఒక్క పార్ట్‌ అది కూడా మూడు గంటల లోపు మాత్రమే ఉండాలని తేల్చి చెప్పడంతో ఆ దిశగా స్క్రిప్ట్‌కు ప్లాన్‌ చేశాడు. తేజ సినిమా నుండి తప్పుకున్న తర్వాత క్రిష్‌ ఎంట్రీ ఇచ్చాడు. క్రిష్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

‘ఎన్టీఆర్‌’ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్న టీం ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా చిత్రీకరిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం కోసం ఆ దిశగా స్క్రిప్ట్‌ వర్క్‌ను జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. గతంలో తేజ చెప్పినప్పుడు రెండు పార్ట్‌లకు నో చెప్పిన బాలకృష్ణ తాజాగా ఈ చిత్రంను రెండు పార్ట్‌లుగా చేద్దాం అంటూ క్రిష్‌ చెప్పగానే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్ట్‌లను కూడా ఒకే సమయంలో పూర్తి చేసి, రెండు నెలల గ్యాప్‌లో విడుదల చేయాలనేది క్రిష్‌ వ్యూహం అన్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రిష్‌ ‘మణికర్ణిక’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన విడుదల కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాకు నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో సీఎం చంద్రబాబు నాయుడుగా రానా మరియు ఏయన్నార్‌గా అక్కినేని నాగచైతన్యలు కనిపించబోతున్నారు. పలువురు నటీనటులు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

,