ఎన్టీఆర్‌’ ఇబ్బందులకు కారణం అదా?       2018-05-06   00:37:03  IST  Raghu V

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం ఇటీవలై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతలు మీదుగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యి, దసరాకు సినిమా వస్తుందని భావిస్తున్న తరుణంలో దర్శకుడు తేజ తాను తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి బాంబు పేల్చాడు. ఈ చిత్రంకు తాను న్యాయం చేయలేను అని, ఇంత భారీ ప్రాజెక్ట్‌ తన వల్ల కాదేమో అనిపిస్తుందంటూ తప్పుకున్నాడు.

తేజ తప్పుకోవడంతో దర్శకుడి అన్వేషణ కొనసాగుతుంది. అనేకమంది దర్శకులను పరిశీలించిన తర్వాత బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నెత్తికి ఎత్తుకోవాలని భావించాడు. కాని ఎన్టీఆర్‌ చిత్రంలో ఎక్కువ పాత్రలు చేయడంతో పాటు, ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న చిత్రం అవ్వడంతో తను దర్శకత్వం చేయడం బాగోదనే ఉద్దేశ్యంతో బాలయ్య వెనుకంజ వేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని చేయాలనే పట్టుదలతో ఉన్న బాలయ్య అసలు ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడే ‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం తీసుకున్న ఆఫీస్‌ వాస్తు సరిగా లేదని తేలిపోయింది.

బాలకృష్ణ వాస్తును ఎంతగా పట్టించుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్‌ భవన్‌లోనే వాస్తు మార్పులు చేయించిన బాలయ్య ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకుంటాడు. అందుకే బాలయ్య తన తండ్రికి సంబంధించిన సినిమాకు పలు అడ్డంకులు వస్తుంటే ఖచ్చితంగా ఇది వాస్తు దోషమే అనే నిర్ణయానికి వచ్చాడు. ఈ చిత్రం కోసం తీసుకున్న ఆఫీస్‌ గతంలో ఒక ప్రముఖ నిర్మాత ఇల్లు అని తెలుస్తోంది. ఆయన వరుసగా ఫ్లాప్‌లు అవ్వడంతో ఇంటిని ఆఫీస్‌లుగా కిరాయికి ఇచ్చుకుంటున్నాడు.

ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండటం వల్లే సినిమాకు సంబంధించిన పనులు ఏవీ సరిగా సాగడం లేదని, స్క్రిప్ట్‌ కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని, తాజాగా దర్శకుడు జంప్‌ అవ్వడం వంటి కారణాల వల్ల సినిమా ఆఫీస్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఫిల్మ్‌ నగర్‌లో అందరికి అందుబాటులో ఉండేలా ఒక ఆఫీస్‌ను చూడాల్సిందిగా ఇటీవలే తన మేనేజర్‌కు బాలయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ‘ఎన్టీఆర్‌’ సినిమా ఇబ్బందులకు కారణం తెలిసింది కనుక, ఇక సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్దం చేసే అవకాశం ఉంది.