హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వ‌రా..!     2017-07-19   23:10:38  IST  Raghu V

తెలంగాణ సీఎం కేసీఆర్ 2019 ఎన్నిక‌ల్లో సొంత పార్టీ నేత‌ల‌కు భారీ షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాను ఏ ప‌ని చేయాల‌నుకున్నా ఎవ్వ‌రి మాట విన‌ని ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇవ్వ‌న‌ని ఇప్ప‌టికే చెప్పేస్తున్నారు. కేసీఆర్ ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఓ సారి స‌ర్వేలు చేయిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌స్తున్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉండ‌గానే కొంద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టిక్కెట్లు వ‌స్తాయా ? రావా ? అని తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యేకే ఈ సారి టిక్కెట్ రాద‌ని కేసీఆర్ తెగేసి చెప్పిన‌ట్టు టీ పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్‌లో ఉద్య‌మ నాయ‌కుడిగా ఎదిగి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌నకు కేసీఆర్ ఎందుకు టిక్కెట్ ఇవ్వ‌న‌న్నారు ? ఆ క‌థేంటో చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు గెలిచారు న‌ల్లాల ఓదేలు. ఆయ‌న టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జి.వినోద్‌ను ఏకంగా మూడుసార్లు ఓడించారు.

అయితే ప్ర‌స్తుతం ఓదేలు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల క‌న్నా సొంత ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీఠ వేస్తున్నార‌ట‌. బినామీ కాంట్రాక్టుల‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల‌తో బిజీ అయిన ఓదేలుపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో తాగునీటి స‌మ‌స్య‌తో ప్ర‌జ‌లు కొట్టుమిట్టాడుతున్నా ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమర్శ‌లు ఉన్నాయి. ఇక సింగ‌రేణిలో ఉద్యోగాలు ఎక్కువుగా నాన్ లోక‌ల్ వాళ్ల‌కే ఇప్పించే క్ర‌మంలో ఆయ‌న‌కు భారీగా ముడుపులు అందుతోన్న‌ట్టు ఆయ‌న‌పై ఉన్న మ‌రో విమ‌ర్శ‌. కేసీఆర్ స‌ర్వేలో సైతం ఎమ్మెల్యేకు చాలా త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ట‌.

ఇక దీనికి తోడు వినోద్ టీఆర్ఎస్‌లో చేర‌డంతో స‌హ‌జంగానే కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. వినోద్ సీనియ‌ర్ లీడ‌ర్‌. వాళ్ల‌కు సొంత మీడియా కూడా ఉంది. ఆయ‌న‌తో పార్టీకి ఎంతైనా లాభం ఉంటుంద‌న్న లెక్క కేసీఆర్‌కు ఉండ‌నే ఉంటుంది. వినోద్‌కు ఇప్ప‌టికే చెన్నూరు టిక్కెట్‌పై హామీ ఇచ్చిన కేసీఆర్ ఓదేలును బెల్లంప‌ల్లిలో పోటీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. అయితే ఈ నిర్ణ‌యానికి మాత్రం ఓదేలు ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ నుంచి అయినా చెన్నూరులోనే పోటీ చేస్తాన‌ని చెపుతున్నార‌ట‌. ఏదేమైనా ఓదేలు వ్య‌వ‌హారం ఇప్పుడు టీఆర్ఎస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.