తెలంగాణ రాజకీయాల్లోకి న్యూస్ రీడర్ ఎంట్రీ     2018-07-16   11:44:34  IST  Sai Mallula

ఎన్నికల సీజన్ దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్న వారందరు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల నాటికి చాలా కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. అయితే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న ఓ లేడి మాత్రం అందరికి సుపరిచితమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జనాలకే కాదు ఆంధ్రా జనాలకు కూడా తెలిసిన మనిషి రాణి రుద్రమ రెడ్డి. ఈటీవీ, సాక్షి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లలో ఆమె న్యూస్ రీడర్ గా పనిచేసారు.

తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమైన రాణి రుద్రమ రెడ్డి ఏ పార్టీలో చేరతారు? అనేది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ ఆమె పోటీ చేయడం మాత్రం ఖాయం అయిపొయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో రాణి రుద్రమ టిన్యూస్ సంస్థలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఆమె క్రియశీలక పాత్ర పోశించారు. టిన్యూస్ లో తెలంగాణ ఏర్పాటు కోసం చర్చలు, స్పెషల్ స్టోరీలతో ఉద్యమానికి మంచి ఊపు తీసుకువచ్చారు.

రాణి రుద్రమ గతంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైసిపి అధినేత జగన్ ఆలోచన మేరకు అప్పుడు తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఉన్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆమేరకు జగన్ నుంచి హామీ లభించడమే కాదు టికెట్ల కూడా అనౌన్స్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ అనుకోకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది.

News Anchor Rani Rudrama Into Politics-

News Anchor Rani Rudrama Into Politics

విభజనకు ముందు వైఎస్సార్ సిపి తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదని ప్రకటించినా.. తర్వాత సమైక్యవాదం తీసుకుంది. అంతిమంగా తెలంగాణలో దుకాణం మూసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న కొండా దంపతులు, కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి లాంటి నేతలంతా వైసిపికి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో తాను వైసిపిని వీడుతున్నట్లు రాణి ప్రకటించారు.

రాణి రుద్రమ తర్వాత కాలంలో ఏ పార్టీలోనూ చేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీడియాలోనూ కనిపించలేదు. ఆ సమయంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. అయితే ఇటీవల హెచ్ఎం టివి నిర్వహించే దశ దిశ కార్యక్రమంతో మళ్లీ మీడియాలోకి వచ్చారు. త్వరలోనే రాణి క్రియాశీల రాజకీయాల్లో బిజీ అవుతారని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణి రుద్రమ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారా? లేక గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని ఎంపి లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారా అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేయవచ్చని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే జన సమితి నేతలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలంగాణ జన సమితి కలిసి పొత్తు తో పోటీ చేస్తే రాణి రుద్రమ పరిస్థితి ఏంటన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.