రాజకీయ పార్టీలు.. సరికొత్త రాజకీయం !       2018-07-02   05:43:39  IST  Bhanu C

అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం .. చేసేది ఏమి లేకపోయినా ఏదో చేసేసినట్టు కలరింగ్ ఇవ్వడం.. నాలుకను నానా రకాలుగా మడతపెట్టి అడ్డమైన వాగ్దానాలు ఇవ్వడం రాజకీయ నాయకులకు .. పార్టీలకు కొత్తేమి కాదు. అందుకే రాజకీయ నాయకుల మాటలకి విశ్వసనీయత ఉండదు. ఇక ఎన్నికల సమయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి కానీ ఇప్పుడు రాజకీయాలు మరీ దిగజారిపోయాయి. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా పార్టీల పరిస్థితి తయారయ్యింది. విలువలు .. విశ్వసనీయత అనే వాటి గురించయితే ఇప్పుడు వెతకడం కుడా అనవసరమే. ప్రతి పార్టీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి.

ప్రజలకు పనికివచ్చే రాజకీయం కన్నా .. వారి వారి పార్టీలను గట్టెక్కించుకునేందుకు,స్వార్థ ప్రయోజనాల కోసం ఏది పడితే అదే మాట్లాడుతున్నారు.వాళ్ల మాటల్లో, ప్రసంగాల్లో రాజకీయ ఆరోపణలు,ప్రత్యారోపణలు,విమర్శలు మినహా, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేవి ఒక్కటి కూడా కనిపించడంలేదు. ఇక ఎన్నికలు ముందస్తుగా వచ్చేయబోతున్నాయి అని తేలడంతో పార్టీల్లో ఎక్కడలేని హడావుడి కనిపిస్తోంది. అమాంతం ప్రజలపై ప్రేమ మాటల్లో పొంగిపోతోంది.

ఎపీకి అన్యాయం చేసిన కేంద్ర అధికార పార్టీ బీజేపీ ని కరిచేస్తం.. నలిపెస్తాం అంటూ ఇక్కడ ఆవేశంగా మాట్లాడేస్తున్నారు. ఇదంతా నిజమే అనుకునే లోపు ఢిల్లీ వెళ్లి తెల్ల ముఖాలు వెయ్యడంతోపాటు వంగి వంగి సలాం లు చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీ అనే బేధం లేదు . అందరూ ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తున్నారు.

ఏపి ని మోసం చేయడం వల్లే తాము ఎన్డీయే నుంచి బయటికి వచ్చామని, కేంద్రమంత్రి పదవులను కుడా త్యాగం చేశామని,హోదా సాధనకు కృషి చేస్తున్న హీరోలం మేమేనని, జనసేన,వైసీపీలు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని,కేంద్రంతో ఈ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని బాబు ఆరోపిస్తున్నాడు.

దీనిపై బీజేపీని ప్రశ్నిస్తే, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుందని, వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చినందున, ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని,వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ,వైసీపీలు కలిసే పోటీ చేస్తాయంటూ ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాడు. ఇక జనసేన విషయానికొస్తే, టీడీపీ నమ్మించి మోసం చేసిందని, వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్నే అమ్ముకోగలదని,తమకు అధికారం ఇస్తేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పవన్ చెప్పుకొస్తున్నాడు. ఇలా ఎవరికీ వారు ఏదో ఒక ఆరోపణలు చేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారు కానీ ప్రజలకు ఏదైనా చెయ్యాలనే ఆలోచన మాత్రం రాజకీయ పార్టీలు మర్చిపోతున్నాయి.