అనంతపురం వైసీపీ లో కొత్త జోష్ !       2018-05-25   05:08:23  IST  Bhanu C

సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు బాగానే ఉంటుంది అనేది అందరికి తెలుసు. కానీ గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా లో కేవలం రెండంటే రెండు సీట్లు సంపాదించి పట్టుకోల్పోయింది వైసీపీ. ఆ పార్టీకి .. వైసీపీకి నమ్మకస్తుడిగా ఉన్న గుర్నాధరెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైసీపీ పూర్తిగా దెబ్బతిన్నట్టు అయ్యింది. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా .. వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనంతపురంలో సాగినప్పుడు ఆ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.

జగన్ పాదయాత్రతో జిల్లాలో ఊపు రావడంతో నేతలు కూడా వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఊహించని వారు కూడా పార్టీలోకి వస్తుండటంతో అనంతపురం జిల్లాలో వైసీపీకి మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, అనంతపురం పట్టణంలో మంచి పట్టున్న నేత కొగటం విజయభాస్కర్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే నాలుగు రోజుల క్రితం మంత్రి కాల్వ శ్రీనివాసులు నియోజకవర్గంలోని బొమ్మనహళ్లికి చెందిన ముల్లంగి బ్రదర్స్ అనుచరులతో కలసి వైసీపీలో చేరిపోయారు. అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవర చెరువు మండలంలో టీడీపీకి చెందిన సర్పంచ్ లు, లీడర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జిల్లాలో కొత్త జోష్ నింపారు.

గతంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేసిన మంత్రి కాల్వ శ్రీనివాసులు సామాజిక వర్గానికి చెందిన రంగయ్య వైసీపీలో చేరారు. ఆయనకు హిందూపురం, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. అలాగే .. మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి సోదరుడు, పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ రెడ్డి కూడా వైసీపీ లో చేరడంతో పార్టీ బలం పెరిగిందని వైసీపీ నాయకులూ సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలోనూ పారిశ్రామికవేత్త శివారెడ్డి ఫ్యాన్ పార్టీలోకి వచ్చేశారు. గురునాధరెడ్డితో పాటు టీడీపీలో చేరిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మళ్ళీ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇదే ఊపు కొనసాగితే వైసీపీ జిల్లాలో జెండా రెపరెపలాడించడం ఖాయంగానే కనిపిస్తోంది.