వారు వస్తే వార్ వస్తుందా ..? వైసీపీలో కొత్త తలనొప్పులు !     2018-07-14   02:02:27  IST  Bhanu C

జగన్ చేపడుతున్న పాదయాత్ర పుణ్యమా అని ఆ పార్టీకి మంచి ఓయూ వచ్చింది. దీనికి తోడు ఎన్నికల సమయం కూడా దగ్గరకు వస్తుండడంతో నేతలంతా ఒక్కొక్కరుగా ఫ్యాను కింద సేదతీరేందుకు క్యూ కడుతున్నారు.అయితే పార్టీలో నాయకులు చేరేందుకు వస్తుంటే వైసీపీలో ఆనందం … ఆందోళన రెండూ ఒక్కసారే కనిపిస్తున్నాయి. కొత్తగా ఎవరు పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నా ఆ ప్రాంత నేతలు అడ్డుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎందుకంటే వారు వస్తే తమ సీటుకి ఎక్కడ ఎసరు పెడతారో అనే ఆందోళన వాయారీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వైసీపీలో ఎక్కువగా ఇటువంటి సంఘటనలే చోటు చేసుకోవడంతో అధినేత జగన్ కు చికాకు తెప్పిస్తున్నాయి.

గత కొంత కాలంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించినా దీనిపై ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తెలియక వైసీపీ ఆందోళన చెందుతోంది. రాంనారాయణరెడ్డి చేరితే.. నెల్లూరు జిల్లాలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని వైకాపా వర్గాలు అంటున్నారు. కానీ, ఇక్కడే సమస్య మొదలైంది. ఆయనకి పార్టీలో కీలకపాత్ర ఇస్తే. సీనియర్ నేత మేకపాటి పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలౌతుంది..? ఇప్పటికే ఆయన వర్గం ఆనం రాకపై కాస్త గుర్రుగానే ఉన్నట్టు సమాచారం. అయితే, ఇదే అంశమై జగన్ దృష్టి సారించారనీ తెలుస్తోంది.

అదేవిధంగా… టీడీపీ నుంచి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా వైకాపాలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. అది ఎంతవరకూ నిజమో తెలీదుగానీ. అదే జరిగితే స్థానికంగా అక్కడా ఇలాంటి సమస్యే తప్పేలా లేదు. ఇక, ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ త్వరలోనే మరికొంతమంది సీనియర్ నేతలు, తటస్థంగా ఉంటున్న నాయకులను చేర్చుకునే కార్యక్రమం మొదలుపెడతారనీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీలోకి వస్తామన్న అందరిని చేర్చుకుంటూ పోతే పాత నేతల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.ఇబ్బడిముబ్బడిగా నేతల్ని పార్టీలోకి తీసుకొస్తే. అదో కొత్త సమస్యగా మారుతుందనే చర్చ వైసీపీ వర్గాల్లో మొదలయ్యింది.