దేశంలో ముందస్తు ఎన్నికలు ..? ఆ కసరత్తు వెనుక మర్మం ఇదేనా ..?       2018-06-20   02:19:55  IST  Bhanu C

ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలు అందుకు ముందుగానే సిద్ధం అవుతున్నాయి. ”జమిలి” ఎన్నికల పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. రాబోయే నవంబర్, డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందనే వార్తలు తరుచు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు కేంద్రం ముందస్తు ఎన్నికలకి ఎందుకు వెళ్లాలనుకుంటుంది..? దానివల్ల బీజేపీకి ఏమైనా కలిసొచ్చే అంశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు బీజేపీకి శాపంగా మారాయి. దాని ఫలితంగా బీజేపీపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి నిదర్శనం మొన్నామధ్య జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడమే దానికి నిదర్శనం. అదీ కాకుండా…ఈ ఏడాది చివరిలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరాగబోతున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉంది. సహజంగానే అక్కడ అధికార వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. రాజస్థాన్‌లో ఐదేళ్ల కిందటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. తీవ్రమైన అధికార వ్యతిరేకతను అక్కడి వసుంధర రాజే ప్రభుత్వం మూటగట్టుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గట్టెక్కడం కష్టమే. ఈ రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే.. బీజేపీకి మెరుగైన ఫలితాలు రావడం సాధ్యం కాదు.

వాస్తవానికి బీజేపీకి ఈ పరిస్థితి గుజరాత్‌లోనే వచ్చింది. అయితే నరేంద్రమోడీ, అమిత్ షా ఇద్దరూ గుజరాతీయులే కావడంతో… గుజరాత్‌కు చెందిన ప్రధానిని.. గుజరాతీయులు ఎలా ఓడిస్తారన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. అక్కడ రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా ప్రచారం చేశారు. పైగా కాంగ్రెస్‌కు బలమైన నేతలు లేరు. దాంతో బీజేపీ గట్టెక్కగలిగింది. కానీ ఓటింగ్ శాతం బాగా తగ్గింది. కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు రాష్ట్రాల్లో బలమైన నేతలున్నారు.

ఇక్కడ గనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే… ఆ పార్టీ బాగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకూ జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది కానీ… కాంగ్రెస్ గెలవడం లేదు. కానీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఆ పార్టీ మళ్లీ రేసులోకి వచ్చినట్లవుతుంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి.

ఉత్తరాదిలో ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు.. రోజురోజుకు… బలం పెంచుకుంటున్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుని.. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా.. అండగా నిలిస్తే.. బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అందుకే కాంగ్రెస్ బలం పెరగకుండానే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకం కాలేదు. కానీ ఏకమయ్యే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నాయి. విపక్షాలు ఏకమైతే.. బీజేపీకి గడ్డు పరిస్థితేనని ఇటీవలి కాలంలో ఉపఎన్నికల ద్వారా తేలింది. అందుకే.. విపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా మారే ప్రయత్నాల్లో ఉండగానే.. ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు సమాచారం.