తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలు భుజాన వేసుకుని ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడిగా ముద్ర వేయించుకోవాలని తహతహలాడుతున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలోనూ, ప్రజల్లోనూ తన పరపతి పెంచుకోవాలని చూస్తున్నాడు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్లడం, అదే సమయంలో బీజేపీ టీడీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని వలసలను ప్రోత్సహించడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు ఆత్మస్థైర్థాన్ని కోల్పోతున్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం టీడీపీ ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టే చెప్పుకోవాలి.ఈ పరిస్థితుల నుంచి పార్టీని తేరుకునేలా చేసి మునుపటి ఉత్సాహం పార్టీలో ఉండేలా చేయాలని లోకేష్ భావిస్తున్నాడు.
అందుకే ‘సైకిల్’ యాత్ర చేపట్టాలని చూస్తున్నాడు.ఇప్పటికే ఏపీలో చేపట్టిన పాదయాత్రలన్ని సూపర్ సక్సెస్ అవ్వడంతో లోకేష్ ఈ యాత్రకు సిద్ధం అవుతున్నాడు.

ప్రస్తుతానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఇప్పుడు పాదయాత్ర చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని, ఎన్నికల సమయంలో పాదయాత్ర చేపట్టి ప్రస్తుతానికి సైకిల్ యాత్రతో ప్రజల్లోకి వెళ్లాలనేది లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది.సైకిల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు.అదే సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ, జనాలను, కార్యకర్తలను పరామర్శిస్తూ, పలకరిస్తూ వెళితే సైకిల్ యాత్ర సూపర్ హిట్టవుతుందని లోకేష్ తో పాటు పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారట.ఎన్నికల ఘర్షణలు, ఎన్నికల తర్వాత గొడవలతో చాలామంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారని ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా ఆరోపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు.ఇప్పటికే బాబు కార్యకర్తల కుటుంబాలకు ఓదార్పు నిర్వహించారు.ఆర్థికంగా ఆదుకుంటామని, కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
చంద్రబాబు ఓదార్పు యాత్రలు చేసినా తాను సైకిల్ యాత్ర తో జనాల్లో క్రేజ్ తెచ్చుకోవాలని లోకేష్ భావిస్తున్నాడు.
అయితే లోకేష్ సైకిల్ యాత్ర ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.ఈ యాత్రకు అధినేత చంద్రబాబు ఒకే చెప్పగానే సైకిల్ మీద దూసుకుపోవాలని లోకేష్ చూస్తున్నాడు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.అనేక సభలు, సమావేశాల్లో పాల్గొన్నాడు.
కానీ నేరుగా ప్రజల్లోకి వెళ్ళింది తక్కువ.కానీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, క్లిష్టపరిస్థితుల్లో ఉండడంతో లోకేష్ ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడే సమయం వచ్చినట్టే లోకేష్ భావిస్తున్నారు.
సైకిల్ యాత్ర ద్వారా వీలైనన్ని ప్రాంతాలను చుట్టేస్తే, ప్రజా నాయకుడిగానూ తాను నిలదొక్కుకున్నట్టేనని లోకేష్ భావిస్తున్నారు.







