చినబాబుకి సైకిల్ 'సీటు' ఒకే ! మరి ఆ బాబు 'సీటు' ఎక్కడో       2018-06-29   01:50:30  IST  Bhanu C

దొడ్డిదారిలో వచ్చి మంత్రయ్యాడు … ఆయనకేం తెలుసు ఆయన వట్టి పప్పు. ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన పనికిరాడు… ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేదు. ఇలాంటి వార్తలు తరచూ వస్తుండడంతో పాటు రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో లోకేష్ చాలాకాలంగా ఆలోచనలో పడ్డాడు. ఈ ఆరోపణలకు పులిస్టాప్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని లోకేష్ కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు కూడా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తేనే మంచిదనే ఆలోచనకు వచ్చాడు. అందుకే ఇప్పటి నుంచే అనువైన నియోజకవర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు.

దీనిలో భాగంగానే లోకేష్‌తో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్టేట్మెంట్ ఇప్పించాడు బాబు. . ‘ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యం. కానీ ఎక్కడనుంచి అనేది అధినేత మాత్రమే డిసైడ్ చేస్తారు’ అంటూ చినబాబు చెప్పిన మాట.. పార్టీలో ఎన్నికల వేడిని రాజేసింది. లోకేష్ కోసం సీటు త్యాగం చేయడానికి ఇప్పటికే ముగ్గురు నేతలు బహిరంగంగా ముందుకొచ్చారు. అయితే.. వాటన్నిటినీ చంద్రబాబు తిరస్కరించారని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు అయితేనే లోకేష్‌కి బాగుంటుందని చంద్రబాబు డిసైడ్ అయిపోయాడట.

కుప్పం నియోజకవర్గానికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. ఇది టీడీపీకి కంచు కొత్తగా ఉంటూ వస్తోంది. ఇక్కడ చంద్రబాబు వరుసగా ఆరుసార్లు గెలుస్తూనే వస్తున్నాడు. ఇక్కడ టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచే ఛాన్స్ అయితే లేదన్నట్టుగా ఉంటుంది. దీంతో పాటు కుప్పం ప్రజలతో లోకేష్ కూడా కొన్నాళ్లుగా టచ్‌లో వున్నారు. ప్రతి మూడునెలలకోసారి కుప్పంలో మకాం వేసి.. అభివృద్ధి పనుల పేరుతో అక్కడి ఓటర్లను ‘గుప్పిట్లో’ పెట్టుకుంటున్నారు. మంత్రి లోకేష్. కుప్పం కాకుండా మరే నియోజకవర్గం అయినా లోకేష్‌కి కొత్తగా అనిపిస్తుందని, పైగా ప్రతిపక్షం ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రమాదం కూడా ఉందని చంద్రబాబు ముందస్తుగా ఆలోచించి.. ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

లోకేష్ కి కుప్పం సీటు ఖాయం చేయడం వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పడు చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు అనేదే ఇంకా తేలాల్సి ఉంది. అయితే టీడీపీ బలంగా ఉంది పార్టీకి కంచుకోటలుగా పిలుచుకునే కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక బలమైన నియోజకవర్గం కోసం బాబు ఇప్పటి నుంచే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. బాబు సామజిక వర్గం ఎక్కువగా ఉండే సీటు అయితే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.