చాలా ఏళ్ల త‌ర్వాత టీడీపీలో కొత్త శ‌క్తి   Nara Lokesh At CRDA Layout Plan     2017-04-12   01:43:08  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీలో లోకేష్ శ‌కం ప్రారంభ‌మైంది. మొన్న‌టి వ‌రకూ పార్టీకే ప‌రిమిత‌మైన ఆయన ఇప్పుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కీల‌క‌మైన శాఖ‌ల‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న‌.. కొద్ది రోజుల్లోనే తానేంటో చూపిస్తున్నారు. కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆయ‌నే జోక్యం చేసుకుంటున్నారు. సీనియ‌ర్ మంత్రులు ఉన్న వారిని ప‌క్క‌న పెట్టి తానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఐఏఎస్‌ అధికారులు కూడా ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు క్యూ క‌డుతున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత టీడీపీలో మరో ప‌వ‌ర్ సెంట‌ర్ పుట్టుకొచ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లాడుతున్నాయి.

మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఇప్పుడు అందరి చూపు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ వైపే! ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌నో ప‌వ‌ర్ సెంట‌ర్‌లా మారిపోయార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. గతంలోనూ ఈ విధంగా ప్ర‌చారం జరిగినా.. ఇప్పుడు అది అధికారికంగా మారింది. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ ఆయన మార్క్ ఉంద‌ని టీడీపీ వర్గాలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక చంద్ర‌బాబు కేబినెట్ లో మంత్రులు కూడా కీలక నిర్ణయాలకు సంబంధించి లోకేష్ వైపు చూడాల్సిన పరిస్థితి ఎదుర‌వుతోంద‌ట‌.

మొన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు సీఎంవోలోని ఉన్నతాధికారులు మినహా మిగిలిన వారితో పెద్దగా పరిచయం లేదు. ఇప్పుడు అధికారికంగా ఐఏఎస్ లతో పరిచయాలకు అడ్డంకి లేకుండా పోయింది. చాలా మంది ఐఏఎస్ లు ఇఫ్పటికే ఆయన చుట్టూ చేరుతున్నార‌ట‌. కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖలు దక్కించుకున్న ఆయన కేవ‌లం తన శాఖ వ్యవహారాల్లోనే కాకుండా మొత్తం అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకోవటానికి రెడీ అయిపోతున్నార‌ట‌. అందులో భాగంగానే తనకు సంబంధం లేకపోయినా సీఆర్డీఏ పరిధిలోని లే అవుట్లకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో లోకేష్ పాల్గొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

సీఆర్డీఏ లేఅవుట్ల మంత్రివర్గ ఉప సంఘంలో యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నా.. లోకేష్ మాటను కాదనలేని పరిస్థితి. ఈ స‌మావేశంలో సీనియర్ మంత్రుల కంటే చాలా చొరవగా నిర్ణయాలను ప్రభావితం చేసేలా వ్యవహరించార‌ట‌. రాబోయే రోజుల్లో చంద్రబాబు వైపు వెళ్లే వారి కంటే నారా లోకేష్ చుట్టూ తిరిగే వారి సంఖ్య ఎక్కువ‌యినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని పార్టీ నేత వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరో నేత వ్యాఖ్యానించారు. మ‌రి భ‌విష్య‌త్తులో చిన‌బాబు ఆధిప‌త్యం పార్టీలో పెరుగుతుంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.