బిగ్‌బాస్‌ కోసం నాని ఇలా రెడీ అయ్యాడట!       2018-06-05   00:10:56  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఈనెల 10న లాంచనంగా ప్రారంభం కాబోతుంది. పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం ఇప్పటికే పూర్తి అయ్యింది. వారితో అగ్రిమెంట్స్‌ కూడా పూర్తి కావచ్చాయి. ఈసారి సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా ఎంట్రీ దక్కడంతో షో మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానంను దక్కించుకుంది. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ తనదైన శైలితో సూపర్‌ హిట్‌ చేశాడు. ఇప్పుడు నాని రెండవ సీజన్‌ను నడిపించేందుకు సిద్దం అయ్యాడు.

ఎన్టీఆర్‌ రెండు పెద్ద సినిమాలకు కమిట్‌ అవ్వడం వల్ల రెండవ సీజన్‌కు నో చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో రెండవ సీజన్‌ను సూపర్‌ హిట్‌ చేయాలనే పట్టుదలతో వెదికి వెదికి నానిని స్టార్‌ మా వారు పట్టుకున్నారు. ఈ షోకు నాని మాత్రమే సక్సెస్‌ను తెచ్చి పెట్టగలడు అని అంతా నమ్ముతున్నారు. నిర్వాహకులు తనపై పెట్టుకున్న నమ్మకంను నిలుపుకునేందుకు నాని పూర్తిగా తన వంతు కృషి చేస్తున్నాడు. బిగ్‌బాస్‌ కోసం ఒక సినిమా కంటే ఎక్కువగా రెడీ అవుతున్నాడు. సహజ నటుడిగా పేరున్న నాని సినిమాల్లో నటించే సమయంలో పెద్దగా టేక్స్‌ తీసుకోకుండా చేస్తాడు. అలాగే ఇప్పుడు కూడా బిగ్‌బాస్‌ కోసం సిద్దం అవుతున్నాడు.

బిగ్‌బాస్‌కు హోస్టింగ్‌ అనగానే కాస్త వెనుక ముందు ఆలోచించిన నాని, ఛాలెంజ్‌ను స్వీకరించినప్పుడు మాత్రమే తన సత్తా అనేది తెలుస్తుందని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఈ షోను ఓకే చేశాడు. నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్‌ చదివేద్దాం అని భావించకుండా, సొంతంగా కూడా తన మార్క్‌ను ఏర్పాటు చేయాలని నాని భావించాడు. అందుకే హిందీతో పాటు పలు భాషల్లో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ వీడియోలు చూశాడు. హోస్ట్‌ ఎలాంటి సమయంలో ఎలా వ్యవహరించారు చూశాడు. ఇంకా పలు షోలను చూసి హోస్ట్‌ సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలని నేర్చుకున్నాడు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం ఎంపిక చేయగానే నాని మొదట ఎన్టీఆర్‌తో మాట్లాడటం జరిగింది. తాను సీజన్‌ 2కు హోస్ట్‌గా చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పి, ఆయన వద్ద పలు సూచనలు మరియు సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నాని చాలానే గ్రౌండ్‌ వర్క్‌ చేసినట్లుగా అనిపిస్తుంది. నాని జూన్‌ 10న బుల్లి తెరపైకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుల్లి తెరపై నానికి ఇదే తొలి ప్రయత్నం. మరి ఈ ప్రయత్నంలో ఆయన ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.