"మనం" పై కావాలనే కుట్ర పన్నారా? ఇదిగోండి ఆధారం     2017-11-17   19:39:41  IST  Raghu V

నంది అవార్డుల ప్రకటన ఇదివరకెప్పుడు ఇన్ని సంచలనాలకి దారి తీయలేదు‌. ఇక్కడ లెజండ్ కి ఉత్తమ చిత్ర పురస్కారం ఎందుకు ఇచ్చారు అనేది ఒక వాదన అయితే, మనం కి ఎందుకు ఇవ్వలేదు, మనంని కాదని లెజండ్ కి ఎందుకు ఇచ్చారు అనేది అసలు వాదన. బాహుబలి గ్రాఫిక్స్ గురించి, వేల కోట్ల కలెక్షన్ల గురించి మనం గొప్పగా చెప్పుకుంటామేమో కాని, గత దశాబ్ద కాలంలో, క్లాసిక్ గా చెప్పుకోదగ్గ అందమైన సినిమా ఏది వచ్చింది అంటే, నిర్మొహమాటంగా “మనం” అని చెప్పాలి‌. ఈ విషయాన్ని రాజమౌళి అయినా సరే, ఒప్పేసుకుంటారు. అలాంటి మనంకి అవార్డు ఎందుకు ఇవ్వలేదు అంటే జ్యూరికి ఉన్న కారణాలు జ్యూరికి ఉండవచ్చు కాని వారికి అవార్డు ఇవ్వకపోవడానికి చెప్పిన కారణమే ఇక్కడ నవ్వులపాలవుతోంది.

మనంలో పునర్జన్మల కాన్సెప్ట్ ఉండటంతో, అలాంటి మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేసినట్టుగా ఉండకూడదని మనంని విస్మరించాలమని చెప్పారు ఒక జ్యూరి మెంబర్. ఇందులో ఎలాంటి లాజిక్ ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే 2012 లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన “ఈగ” కూడా పునర్జన్మ ఆధారంగా రూపొందిన సినిమానే. పైగా, మనం కుటుంబ అనుబంధాల మీద తీస్తే, ఈగ పగ, ప్రతీకారల మీద తీసారు. మరి ఈగకి వాడని లాజిక్ మనంకి మాత్రమే ఎందుకు వాడినట్టో? పునర్జన్మలు, మూడనమ్మకాల మీద తీసిన సినిమాలకి అసలు అవార్డులే ఇవ్వకూడదా? అరుంధతి కి అరడజనుకు పైగా అవార్డులు ఎందుకు ఇచ్చారు?

ఈ రచ్చ ఓవైపు అయితే, గోవిందుడు అందరివాడేలే కి అవార్డులు రాలేదని, రామ్ చరణ్ కి అవార్డులు రాలేదని ఓవైపు నిర్మాత బండ్ల గణేష్ రచ్చ రచ్చ చేస్తోంటే, కేవలం మంచి కథావస్తువునే ఎంచుకోవడమే తప్ప, దాన్ని మంచి సినిమాగా మలచలేకపోయిన గుణశేఖర్ “రుద్రమదేవి” కి అవార్డులు ఎక్కడంటూ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, ఎన్. బుజ్జి, సీ కళ్యాణ్ లాంటి పెద్ద నిర్మాతలు లైవ్ గా టీవిలో ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు. ఓ గొప్ప సినిమా తీసి ప్రజల మెప్పు పొందిన నాగార్జున – విక్రమ్ కుమార్ మాత్రం తమ పనుల్లో తాము బీజీగా ఉన్నారు.