నంది అవార్డుల పై నిరసన - చంద్రబాబుకి గుణశేఖర్ లేఖ     2017-11-15   21:59:39  IST  Raghu V

నంది అవార్డుల ప్రకటన చాలా పెద్ద వివాదానికే తెరలేపింది. ఒకరి తరువాత ఒకరు, నంది అవార్డుల ప్రకటనలో తెదేపా పక్షపాత వైఖరిని ప్రదర్శించింది అని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత బన్ని వాసు తరువాత ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. తానూ రుద్రమదేవి చారిత్రాత్మక సినిమాను తీస్తే, ఒక తెలుగువాడిగా కనీస మర్యాదలు కూడా ఇవ్వడం లేదు అంటూ వాపోయారు గుణశేఖర్. నంది అవార్డులపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఒక బహిరంగ లేఖను కూడా రాసారు గుణశేఖర్. ఆ లేఖ యొక్క సారాంశం క్లుప్తంగా మీకోసం.

“రుద్రమదేవి చిత్ర విడుదలకి ముందు, తెలుగు ఖ్యాతిని చాటిచెప్పే ఇలాంటి చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, అదే మరో చారిత్రాత్మక చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణికి మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చారని, ఈ వైఖరిని తప్పు పడుతూ, 2014, 2015 మరియు 2016 నంది అవార్డుల ఎంపికలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే, మూడేళ్ళు వారిని అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారా? మహిళ సాధికారత మీద తీసిన రుద్రమదేవి లాంటి సినిమాని అసలు పట్టించుకోలేదని, కనీసం జ్యూరి గుర్తింపు కూడా దక్కలేదని, మరచిపోయిన తెలుగు చరిత్రను తిరిగి గుర్తుచేస్తే, ఇచ్చే గౌరవం ఇదేనా, అలాంటి సినిమా తీసినందుకు నన్ను క్షమించండి” అనే అర్థం వచ్చేలా సాగింది గుణశేఖర్ లేఖ.

గుణశేఖర్ లాంటి పేరుమోసిన దర్శకుడు ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సినిమా ప్రముఖలని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ విషయంపై అవార్డులు పొందినవారు, ఇండస్ట్రీలోని తెదేపా స్నేహితులు, ప్రేమికులు ఎలా స్పందిస్తారో చూడాలి.