రికార్డ్‌.. వర్మకు ప్రత్యేకమైన పాలాభిషేకం       2018-06-05   23:53:58  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుందనే విషయం తెల్సిందే. రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా తీసినా, వెబ్‌ సిరీస్‌ తీసినా చివరకు షార్ట్‌ ఫిల్మ్‌ తీసినా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. ఆయన వద్ద ఏదో అయస్కాంత గుణం ఉన్నట్లుగా జనాలు అంతా కూడా ఆయన వెంట పడుతూ ఉంటారు. ఆయన ఎన్ని ఫ్లాప్‌లు తీసినా, ఎన్ని చెత్త సినిమాలు తీసినా కూడా వర్మను కొందరు సినీ ప్రముఖులు అభిమానిస్తూనే ఉంటారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ప్రతి ఒక్క యంగ్‌ తెలుగు హీరో కోరుకుంటాడు అంటే ఆయన స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాంటి వర్మ దర్శకత్వంలో తాజాగా ‘ఆఫీసర్‌’ చిత్రం వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆఫీసర్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ సినిమాగా ఇది నిలిచి పోవడం ఖాయం అయ్యింది. నాగార్జున తర్వాత వర్మ తాను అఖిల్‌తో మూవీ చేస్తాను అంటూ ప్రకటనలు చేస్తున్నాడు. అఖిల్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేశాను అని, ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులకు వినిపించి, ఓకే చెప్పించాను అంటూ గతంలో చెప్పుకొచ్చాడు. ఆఫీసర్‌ ఫలితం తర్వాత అఖిల్‌తో వర్మ సినిమా వద్దంటే వద్దు అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు.

అఖిల్‌ ఇప్పటికే చేసిన రెండు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఆ రెండు సినిమాలు అఖిల్‌ కెరీర్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న మూడవ సినిమా అయినా సక్సెస్‌ను దక్కించుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్మతో అఖిల్‌ మూవీ అంటే అతి పెద్ద తప్పిదం అవుతుందని అక్కినేని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఒక వేళ అక్కినేని ఫ్యామిలీ వర్మను నమ్మితే మాత్రం తాము నిరసన వ్యక్తం చేస్తామని కూడా అంటున్నారు.

మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్‌ వర్మకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే తమ వ్యతిరేకతను వినూత్నంగా చూపించారు. పలువురు అభిమానులు వర్మ కటౌట్‌కు పాలాభిషేకం చేసి దయచేసి తమ అఖిల్‌ జోలికి రావద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. సహజంగా అయితే పాలాభిషేకం ఏదైనా మంచి పని చేస్తే చేస్తారు. కాని వర్మతో ఒక పని వద్దని చెప్పడానికి ఇలా పాలాభిషేకం చేశారు. వర్మకు అన్ని ప్రత్యేకం అని చెప్పడానికి ఇదే నిదర్శణం. ఆయన జీవితమే ప్రత్యేం అంటూ కొందరు అంటూ ఉంటారు.

ఆ విషయము నిజమేనేమో అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. మొత్తానికి అఖిల్‌, వర్మల సినిమా అక్కినేని ఫ్యాన్స్‌కు ఇష్టం లేని కారణంగా గతంలో ఎవరికి జరగని విధంగా నిరసన సెగ వర్మకు తగిలింది. వింత నిరసన ఎదుర్కొన్న వర్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. పాలాభిషేకంతో మనోడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

ఆఫీసర్‌ ఫలితం తర్వాత నాగార్జున ఖచ్చితంగా వర్మకు అఖిల్‌ను అప్పగించడు అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు నాగార్జున మాత్రం అధికారికంగా వర్మ, అఖిల్‌ల మూవీ గురించి మాట్లాడినది లేదు.