సంపూర్నేష్‌ బాబు సినిమా కంటే ‘ఆఫీసర్‌’కే తక్కువ!       2018-06-03   01:18:42  IST  Raghu V

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమా కలెక్షన్స్‌ మొదటి మూడు రోజులు భారీ ఎత్తున ఉంటున్న విషయం మనం గమనించవచ్చు. కేవలం మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారీ ఎత్తున థియేట్లలో విడుదల చేస్తున్నారు. చిన్న హీరో సినిమా అయినా కూడా మొదటి రోజు సునాయాసంగా కోటి రూపాయల షేర్‌ను రాబడుతుంది. కాని ఆఫీసర్‌ సినిమా మాత్రం మరీ దారుణంగా వసూళ్లు సాధిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం 47 లక్షల షేర్‌ను వసూళ్లు చేయడంతో అక్కినేని ఫ్యాన్స్‌ మొహం ఎత్తుకోలేక పోతున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ను దక్కించుకుంది. దాంతో సినిమాకు మొదటి రోజు నుండే కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని ఏరియాల్లో కలిపి కేవలం 47 లక్షల షేర్‌ను రాబట్టింది. ఇతర అన్ని ఏరియాల్లో కలిపి మరో అయిదు లక్షలకు మించి వసూళ్లు చేయలేదు. ఇక రెండవ రోజు మరీ దారుణమైన పరిస్థితి నెలకొంది. కేవలం 15 లక్షలు మాత్రమే ఈ చిత్రం వసూళ్లు చేసిందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. మొదటి మూడు రోజుల్లో కనీసం కోటి రూపాయలు అయినా వస్తాయని ఆశిస్తే ఈ చిత్రం మరీ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.

మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం కోటి షేర్‌ను రాబట్టడం అసాధ్యం అని తేలిపోయింది. ఇక సంపూర్నేష్‌బాబు నటించిన ‘సింగం 123’ చిత్రం మొదటి మూడు రోజుల్లో 1.75 కోట్ల షేర్‌ను రాబట్టింది. సంపూకు ఉన్న క్రేజ్‌తో ఆ స్థాయి వసూళ్లు సాధ్యం అయ్యాయి. సంపూతో పోల్చితే నాగార్జున సూపర్‌ స్టార్‌ అని చెప్పుకోవచ్చు. కాని నాగార్జున మొదటి మూడు రోజుల్లో కనీసం కోటి రూపాయల షేర్‌ను కూడా రాబట్టడంలో విఫలం అయ్యింది. సంపూ స్థాయిలో కూడా నాగార్జున కలెక్షన్స్‌ను రాబట్టలేక పోవడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

నాగార్జున ఇటీవల నటించిన సినిమాల్లో ఇంత తక్కువ వసూళ్లు సాధించడం ఇదే అని, వర్మ దర్శకత్వంలో సినిమాకు కమిట్‌ అయ్యి నాగార్జున పెద్ద తప్పు చేశాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎంత అనుకుని ఏం లాభం, వర్మ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో ఒక మచ్చగా నిలువబోతుంది. రామ్‌ గోపాల్‌ వర్మ గతంలో నాగార్జునకు అద్బుతమైన సినిమాలను ఇచ్చాడు. ఇప్పుడు అదే వర్మ చెత్త రికార్డును కట్టబెట్టాడు.