నాగార్జున గుడ్డిగా వెళ్లి పోతున్నాడు     2018-06-12   04:17:54  IST  Raghu V

కింగ్‌ నాగార్జున ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాలు, కమిట్‌ అయిన సినిమాలు, విడుదలైన సినిమాలను చూస్తుంటే ఏదో సినిమాలు చేయాలి కాబట్టి చేస్తున్నాడు అంతే అన్నట్లుగా అనిపిస్తుంది. నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు, నేను నటిస్తున్నాను అన్నట్లుగా నాగార్జున వ్యవహరిస్తున్న తీరు అక్కినేని అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. కొడుకుల కెరీర్‌పై పెడుతున్న దృష్టి తన సినిమాలపై పెట్టడం లేదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తం అవుతుంది. అందుకే గత కొంత కాలంగా నాగార్జున వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇటీవలే విడుదలైన ‘ఆఫీసర్‌’తో పాటు త్వరలో కళ్యాణ్‌ కృష్ణతో చేయబోతున్న సినిమాల విషయంలో నాగార్జున నిర్ణయంను అంతా తప్పుబడుతున్నారు.

నానితో ప్రస్తుతం శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ను నాగార్జున చేస్తున్నాడు. దర్శకుడు శ్రీరాం ఆధిత్య పెద్దగా అనుభవం లేని దర్శకుడు. ఆయన ఈమల్టీస్టార్‌ను ఆకట్టుకునే విధంగా తీస్తాను అనే నమ్మకం ఎవరికి లేదు. ఎందుకటే ఆయన గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు కనుక, ఈ చిత్రం కూడా మెప్పించలేదని ఫిక్స్‌ అయ్యారు. ఈ సమయంలోనే నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్న సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా బంగార్రాజు గురించిన కథ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.