నా పేరు సూర్యకు ఊహించని షాక్‌       2018-05-11   02:12:35  IST  Raghu V

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య’ చిత్రం గత వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ రాలేదు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను ఈ చిత్రం నిరాశ పర్చిందని చెప్పక తప్పదు. బన్నీకి భారీ విజయం ఈ చిత్రం తెచ్చి పెడుతుందని భావించగా అంత సీన్‌ లేదు అంటూ ప్రేక్షకులు తేల్చి పారేశారు. అయితే సినిమా డిజాస్ట్రర్‌ మాత్రం కాదని, చూడదగ్గట్లుగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగానే మొదటి వారంలో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే ఆశించిన షేర్‌ మాత్రం ఇంకా రాలేదు.

రెండవ వారంలో సినిమాకు పెట్టిన పెట్టుబడి మరియు డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి వస్తుందని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు పెద్ద షాక్‌ ‘మహానటి’ ద్వారా ఎదురైంది. ‘మహానటి’ విడుదలకు ముందు వరకు మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన ‘నా పేరు సూర్య’ ఎప్పుడైతే ఆ సినిమా విడుదల అయ్యిందో అప్పుడే డల్‌ అయ్యింది. మహానటికి భారీగా రెస్పాన్స్‌ దక్కడంతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న సావిత్రి బయోపిక్‌ భారీ వసూళ్లను రాబడుతుంది. దాంతో నా పేరు సూర్య మూవీ కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి.

‘మహానటి’ విడుదలైన తర్వాత ఒక్కసారిగా 75 శాతం కలెక్షన్స్‌ తగ్గాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఈ స్థాయి డ్రాప్‌ తాము ఊహించలేదు అని, మినిమం కలెక్షన్స్‌ వస్తాయని భావించినా కూడా ఇలా షాక్‌ ఇవ్వడం పట్ల చిత్ర యూనిట్‌ సభ్యులు షాక్‌ అవుతున్నారు. సినిమా కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయినా కూడా సినిమాకు థ్యాంక్స్‌ మీట్‌ను వైభవంగా నిర్వహించి చిత్ర నిర్మాతలు గొప్పలు చెప్పుకున్నారు. ఒక వైపు డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో కూరుకు పోగా చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా మంచి వసూళ్లు సాధించిందని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

‘నా పేరు సూర్య’ చిత్రం లాంగ్‌ రన్‌లో 45 నుండి 50 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఒక వైపు రంగస్థలం, భరత్‌ అనే నేను ఇంకా కూడా అక్కడ ఆడుతుండగా, మహానటి కూడా అక్కడ మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దాంతో నా పేరు సూర్య అక్కడ పూర్తిగా డ్రాప్‌ అయినట్లే. సినిమా స్క్రీన్స్‌ అన్ని కూడా తొలగిస్తున్నారు. పై పెచ్చు నేటి నుండి పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా థియేటర్లో సందడి చేయబోతుంది. ఆ కారణంగా నా పేరు సూర్య చిత్రం కలెక్షన్స్‌ మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఇది నిర్మాతకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని షాక్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.