ఎమ్మెల్యే బొండాకు సెగ పెడుతున్న ప్రాణ‌మిత్రుడు!       2018-04-28   23:04:41  IST  Bhanu C

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరుకున్న వారు.. నేడు క‌లిసి పోవచ్చు. గ‌త గంట వ‌ర‌కు క‌ల‌సి కాపురం చేసుకున్న వారు విడిపోయి విడాకులు తీసుకోవ‌చ్చు! అంతా అదికారం, అవ‌కాశం కోసం జ‌రిగేవే!! ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువ చ‌దివిన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమా.. త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంలో పోటీకి వ‌స్తాడ‌ని భావించిన త‌న ప్రాణ మిత్రుడు(గ‌తంలో బోండానే చెప్పుకొన్నాడు) బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ముష్టి శ్రీనివాస్‌తో వైరం పెంచుకున్నాడు. అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు సైలెంట్‌గా ఉన్న ముష్టి శ్రీనివాస్ ఇటీవ‌ల కాలంలో బొండా ఉమా లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తుండ‌డంతో రెచ్చిపోవ‌డం ప్రారంభించాడు.

విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో టీడీపీ కోర్ క‌మిటీలో ముష్టి శ్రీనివాస్, బొండా ఉమాలు క‌లిసి ప‌నిచేశారు. అయితే, 2014లో ఎన్నిక‌ల స‌మ‌యంలో సెంట్ర‌ల్‌లో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండడంతో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ముష్టి తీసుకువ‌చ్చాడు. అయితే, దీనిపై అప్ప‌టికే క‌న్నేసిన బొండా.. త‌న అభిమాని, ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌తో సిఫార‌సు చేయించుకుని టికెట్ కొట్టేశాడు. ఈ క్ర‌మంలోనే బాబు ఆదేశాల మేర‌కు ముష్టి శ్రీనివాస్ అప్ప‌ట్లో బొండాపై తిరుగుబాటు చేయ‌కుండా సైలెంట్‌గా ఉన్నాడు. దీంతో బొండా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అయితే, ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యేగా బొండా ఉమా భూముల కబ్జాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డుతుండ‌డం అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌ను దూరం పెడుతూ వ‌చ్చారు.

దీనిని గ‌మ‌నించిన శ్రీనివాస్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్నారు. బొండా ఓ క‌బ్జాకోరు అంటూ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అంతేకాదు, ఉమాకు సంబంధించిన అన్ని విష‌యాల‌ను మీడియాకు లీకులు ఇస్తున్నాడు. ఇక‌, ఇటీవ‌ల టీటీడీ బోర్డు స‌భ్యుడిగా బొండా ఉమాను నియ‌మించ‌డాన్ని కూడా శ్రీనివాస్ త‌ప్పుప‌ట్టారు. బొండా ఉమా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదంటూ.. చంద్ర‌బాబును దూషించాడ‌ని, ఆయ‌న‌కు టీటీడీలో ప‌ద‌వి ఎందుకు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇది చిలికి చిలికి గాలి వాన‌గా మారి .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే స్థాయికి చేరింది. దీంతో బొండా ఉమా కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోవ‌డం ప్రారంభించాడు. పార్టీలో క్రియాశీలకంగా లేకుండా ప్రతిపక్ష సభ్యులకు సహకరించిన అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

అంతేకాదు, శ్రీనివాస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు లేఖ రాశారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లాది విష్ణుకు అనుకూలంగా శ్రీనివాస్‌ పనిచేశాడని లేకపోతే తనకు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేదని చెబుతున్నారు. అతను పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదని, ఏనాడు బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఆలోచించలేదని, తాను నియోజకవర్గంలో బ్రాహ్మణులకు ఎంతో సేవ చేస్తున్నానని లెక్కలతో సహా చెబుతున్నారు. అయితే, మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రినే ధిక్కరించిన బొండా మీదనే క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, తాను ఏం తప్పు చేశానని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని శ్రీనివాస్ ఎదురుదాడికి దిగారు.

అయితే, ముష్టి శ్రీనివాస్‌ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోపాటు సెంట్రల్‌ నియోజకవర్గంలో బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం పడుతుందేమోనన్న ఆలోచన పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. తొందరపడి శ్రీనివాస్‌పై చ‌ర్చ‌లు తీసుకుంటే.. దీనిని అందిపుచ్చుకుని వైసీపీ బ‌లోపేతం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని నేత‌లు భావిస్తున్నారు. ఏదేమైనా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు తిరుగు లేద‌ని భావించిన బొండా ఉమాకు ఇప్పుడు ముష్టి శ్రీనివాస్ పెద్ద స‌వాలుగా మారాడ‌ని అంటున్నారు. మ‌రి ఈ స‌మ‌స్య ఇక్క‌డితో ఆగుతుందా? వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుందా? అనేది చూడాలి.