పాపను అమ్మకానికి పెట్టిన పాపిస్టులను అరెస్ట్ చేసిన మునగాల పోలీసులు: ఎస్పీ

సూర్యాపేట జిల్లా:తల్లికి మాయమాటలు చెప్పి పిల్లను అమ్మాలని చూసిన నిందితులను మునగాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మొద్దుల చెరువు స్టేజీ వద్ద సోమవారం కొందరు వ్యక్తులు గొడవ పడుతున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంఫై మునగాల స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకోగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పాపను విక్రయించే ఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు.పోలీస్ విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.

నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాకు చెందిన మేరావాత్ పూల్ సింగ్(60) తన కూతురు రాజేశ్వరికి మొదటి సంతానము ఆడపిల్ల పుట్టగా మళ్ళీ రెండవ సంతానంగా 20 రోజుల క్రితం కూతురు జన్మించింది.కూతురికి ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఆమెకు ఆర్దిక భారం అవుతుందని భావించిన తండ్రి పుట్టిన పాపను ఎవరికైనా పిల్లలు లేనివారికి అమ్మి డబ్బులు సంపాదిస్తే నా కూతురు బాగు పడుతుందని అనుకున్నాడు.

కూతురుకి ఈ విషయం చెపితే ఒప్పుకోదని తన మేన కోడలు మేరావత్ దుర్గకు చెప్పాడు.దుర్గ గతంలో హాస్పిటల్ లో స్వీపర్ గా పనిచేసినప్పుడు పరిచయమైన షేక్ సైదమ్మ @సాయిబీ ద్వారా పరిచయమైన ముడావత్ రాజా నాయక్ తో పిల్లల్ని దత్తత చేసుకొనే వారి గురించి అడుగగా అతను నాకు తెలిసిన వారు ఉన్నారని,అందుకు గాను పాపను అమ్మగా వచ్చిన డబ్బులలో కొంత డబ్బు తనకు ఇవ్వాలని,తనకు పరిచయం ఉన్న శివనేని నాగమణితో కలిసి ఒప్పందం చేసుకున్నారు.ముడావత్ రాజా నాయక్, శివనేని నాగమణి కలిసి విజయవాడకు చెందిన గరికముక్కు విజయలక్ష్మీ, వాడపల్లి అశోక్ కుమార్ మధ్యవర్తులుగా రూ.3,00,000/- కు పాపను అమ్మేటట్లు ఒప్పందం చేసుకున్నారు.ఒప్పందంలో భాగంగా పాపను ఒకసారి చూసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని,పాపను సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజీ వద్దకు తీసుకొని రమ్మన్నారు.దీనితో రాజేశ్వరి తండ్రి పూల్ సింగ్,ఆయన మేన కోడలు దుర్గా కలిసి రాజేశ్వరికి మాయమాటలు చెప్పి తీసుకొని సోమవారం (15.04.2024) సాయంత్రం సుమారు 6 గంటలకు మొద్దులచెరువు స్టేజ్ దగ్గరలో గల ఖాళీ స్థలంలోకి వచ్చారు.ఆ సమయంలో పూల్ సింగ్ కూతురు రాజేశ్వరి చేతుల నుండి పాపను బలవంతంగా లాక్కొని ముడావత్ రాజా నాయక్, శివనేని నాగమణికి ఇచ్చాడు.దీనితో పరిస్థితి అర్దం కాని రాజేశ్వరి గట్టిగా ప్రశ్నించగా మీ పాపను మీ నాన్న మాకు రూ.3 లక్షలకు అమ్మినాడని చెప్పటంతో ఆమె ఏడుస్తూ తన పాపను తన దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేయగా వాళ్ళు ఇవ్వక పోవటంతో గట్టిగా కేకలు వేయగా చుట్టూ ప్రక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే పోలీసుల అక్కడకు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ప్రశ్నించగా వారు తాము చేసిన నేరాన్ని అంగీకరింకరించడంతో మునగాల పోలీస్ స్టేషన్ నందు సెక్షన్ 370 (4) ఐపిసి,సెక్షన్ 81 ఆఫ్ జెజె యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను కోర్టు నందు హాజరు పరిచి,రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, మిగతా నలుగురు పరారీలో ఉన్నారని,వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Advertisement

ఈ కేసులో 6 సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు.గతంలో ఇదే రకమైన కేసుల్లో రాజు నాయక్, విజయలక్ష్మి,సింధుపై కేసులు నమోదైనట్లు తెలిసిందన్నారు.పిల్లలను అమ్మడం నేరమని,ఈ రకమైన నేరానికి పాల్పడినా,ప్రోత్సహించినా,ప్రలోభపెట్టినా అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆడపిల్లల అభ్యున్నతికి వారి చదువులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు,మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, మునగాల ఎస్ఐ అంజి రెడ్డి,సీసీఎస్ ఎస్ఐ సాయి ప్రశాంత్ పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News