చావుకు ముహూర్తం...టైం చూసి ఆక్సిజన్ తీయించుకుంటున్నారు.! ఇదెక్కడి నమ్మకాలు.?     2018-11-05   12:41:57  IST  Sai Mallula

భారతదేశం అంటే సంప్రదాయంకి పెట్టింది పేరు..పెళ్లి, గృహప్రవేశం ఇలా ఏ శుభకార్యం చేయడానికి అయినా మంచి ముహూర్తం చూస్తారు. అయితే చాదస్తం కొంతమందికి ముదిరిపోయి మన చేతుల్లో లేని జననమరణాలకు కూడా ముహుర్తాలు చూపించుకుంటున్నారు. ఇటీవలికాలంలో ముహూర్తాలు, జాతకాలు, మోక్షం వంటి అంశాలపై జనానికి నమ్మకం బాగా పెరుగుతోంది.

మంచి ఘడియాల్లో డెలీవరి చేస్తే పుట్టే బాబు మహార్జాతకుడు అవుతాడని..నెలలు నిండకముందే ఆపరేషన్ చేయించేవారి గురించి రోజూ చూస్తూనే ఉన్నాం. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 11 మంది కుటుంబసభ్యుల బృందం అందరూ ఒకే సమయంలో చనిపోతే మోక్షం ప్రాప్తిస్తుందనే నమ్మకంతో.. సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Muhurtham For Death-

Muhurtham For Death

అనారోగ్యంతోనో, వృద్ధాప్యంతోనే ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంటే.. మంచి ముహూర్తంలో దానిని తొలగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులపై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే.. నేరుగా వైకుంఠానికి చేరుతారని మన పురాణాల్లో చెప్పడం కూడా ఇలాంటి వారు సాకుగా చెబుతున్నారు.

మరోవైపు జనం నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు ఈ పద్ధతిని పెంచి పోషిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సాంప్రదాయవాదుల మాత్రం జనన, మరణాలు మన చేతుల్లో లేవని వారు చేసుకున్న పుణ్యఫలాలను బట్టి మరణ ఘడియలు ఉంటాయని.. దాని కోసం ముహూర్తాలు పెట్టించుకోవడాన్ని విమర్శిస్తున్నారు.