మామూలుగా దేశానికి “వెన్నెముక రైతు” అని ఎంతోమంది కవులు మరియు మేధావులు వర్ణించారు.కానీ కాలం మారుతున్న కొద్దీ రైతుని పెళ్లి చేసుకోవడానికి మాత్రం యువతులు అస్సలు ఆసక్తి కనబరచడం లేదు.
దీంతో వ్యవసాయం చేసేటువంటి యువ రైతులు దాదాపుగా 30 ఏళ్ళు నిండిన చాలా మంది బ్రహ్మచారులుగానే ఉంటున్నారు.దీంతో ఓ యువకుడు వ్యవసాయం చేసే యువకులకు పెళ్లిళ్లు చేయడమే కంకణం కట్టుకొని ఏకంగా ఓ మ్యారేజ్ బ్యూరో ని కూడా తెరిచాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ జిల్లాలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ సెటిలయ్యాడు.
అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకి మంచి డిమాండ్ పెరిగింది. కానీ అన్నం పండించే రైతులను మాత్రం పెళ్లిళ్లు చేసుకోవడానికి యువతులు ముందుకు రావడం లేదు.
దీంతో అంజిరెడ్డి రైతు మ్యారేజ్ బ్యూరో ని తెరిచి వ్యవసాయం చేసే యువ రైతులకు పెళ్లిళ్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇందులో భాగంగా రైతులను పెళ్లి చేసుకుంటే వచ్చే లాభాలను యువతి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఇప్పటికే పలు పెళ్లిళ్లు కూడా చేశాడు.
కాగా తాజాగా మండల రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్న ఓ మహిళ ఎమ్మార్వో రైతుని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని అంజి రెడ్డి తెలిపాడు.అంతేగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టణాల్లో కంటే పల్లెల్లోనే జీవితం చాలా సౌకర్యంగా ఉంటుందని అలాగే వసతులు కూడా బాగా మెరుగు పడ్డాయని తెలిపాడు.
దీంతో ఈ విషయం తెలిసిన కొందరు యువ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఉద్యోగం అనేది కేవలం బ్రతకడానికి మాత్రమేనని కానీ వ్యవసాయం మాత్రం పది మందిని బ్రతికిస్తుందని అలాగే వ్యవసాయంలోనే సాయం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.