అంతా మీదే భారం : ఎంపీ అభ్యర్థులకు ఆర్థిక భారంగా ఎమ్మెల్యే అభ్యర్థులు  

Mp Should Take Care Of Mla\'s Financial Issues-elections 2019,financial Issues,mla,mp,opposition Party,political Updates,ruling Party

ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థులు ఆర్ధికం గా వెనుకబడి ఉంటే ఎంపీ అభ్యర్థులు వారికి ఆ అండదండలు అందిస్తుంటారు...

అంతా మీదే భారం : ఎంపీ అభ్యర్థులకు ఆర్థిక భారంగా ఎమ్మెల్యే అభ్యర్థులు -MP Should Take Care Of MLA's Financial Issues

పార్టీలు కూడా ఎంపీలకు ఇదే రకమైన సూచనలు చేస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కాడి మొత్తం జారవిడిచి మొత్తం మీదే భారం, ఆర్ధికంగా నేను అంతంతమాత్రమే అంటూ చేతులెత్తేస్తుండడంతో ఎంపీ అభ్యర్థులు లబోదిబో అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తంతులో ఇదే చోటుచేసుకుంటోంది.

ప్రస్తుతం నామినేషన్ ల హడావుడి మొదలయ్యింది. పోలింగ్ తేదీ కూడా దగ్గరకు వస్తున్న సమయంలో ఇదేం పరిస్థితంటూ ఎంపీ అభ్యర్థులు లోలోపల ఆందోళన చెందుతున్నారు.

అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ విషయంలో కాస్త ఫర్వాలేదు అనిపించినా కొత్తగా సీటు దక్కించుకున్నవారు, రిజర్వడ్ స్థానాల్లో పోటీ చేస్తున్నవారు ఆర్ధిక భారం అంతా ఎంపీ అభ్యర్దులమీదే వేసేస్తున్నారు. ఇటువంటి అనుభవమే గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విషయంలో చోటుచేసుకుందనే టాక్ జోరుగా సాగుతోంది. ఈ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇందులో రెండు ఎస్సీ నియోజకవర్గాలు, మిగిలినవి జనరల్‌ స్థానాలు. ఈ పార్లమెంట్‌ పరిధిలో ప్రస్తుతం ఎంపీగా జయదేవ్‌తో పాటు పొన్నూరు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ తరపున ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడంతో ఇక్కడ కొత్త అభ్యర్థులు బరిలోకి దిగారు.

మంగళగిరిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బరిలో ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి పోటీ చేస్తున్నాడు. దీంతో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హోరాహోరీ పోరు ఉన్న ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు ఆర్థిక అండదండల కోసం అప్పుడే ఎంపీ అభ్యర్థి వైపు చూస్తుండడంపై ఎంపీ అభ్యర్థి గుర్రుగా ఉన్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఆర్ధికంగా చితికిపోయానని, ఇప్పుడు ఖర్చుపెడదామన్నా నా దగ్గర ఏమీ లేదని ఒక ఎమ్యెల్యే అభ్యర్థి చేతులెత్తేశాడట. ఈ విధంగానే నలుగురు అభ్యర్థులు అంతా మీదే భారం, మీరు చూసుకోకపోతే గట్టెక్కడం కష్టం అంటూ తేల్చి చెప్పేస్తున్నారట.