కవిత సీటుకే ఎసరుపెడుతున్న విబేధాలు..కేసీఆర్ కుమార్తెకు విచిత్ర పరిస్థితి     2018-07-06   05:37:21  IST  Bhanu C

తెలంగాణాలో తిరుగులేని మహిళా నాయకురాలిగా … తండ్రి కేసీఆర్ వారసురాలిగా రాజకీయా చక్రం తిప్పుతున్న నిజామాబాద్ ఎంపీ కవితకు స్థానిక రాజకీయాలు చికాకు తెప్పిస్తున్నాయి. రాజకీయాల్లో ఇవన్నీ మాములే కదా అని వదిలేస్తే చివరకు అది ఆమె పోటీ చేసి గెలిచిన నిజామాబాద్ ఎంపీ సీటుకే ఎసరుపెట్టింది. దీంతో ఆమెకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్గ రాజకీయాలు తన సీటుకు ఎసరు తెస్తాయని గ్రహించిన ఆమె ఇప్పుడు ఆ స్థానం మారేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నేతల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. గ్రూపులుగా విడిపోయిన నేతలు ఆధిపత్యం కోసం ఇప్పటి నుంచే యుద్దానికి దిగుతున్నారు. దీంతో ఎంపీ కవిత ఒక గ్రూపును చేరదిస్తే మరో గ్రూపు ఆమెకు దూరమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అందుకే ఆమె ఎవరి విషయంలో కల్పించుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది.

అధికార పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి . నేతలు ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. అదేవిధంగా … నిజామాబాద్ లోకసభ పరిధిలో కూడా ఈ గ్రూప్ తగాదాలు ముదిరిపోయాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్యాచ్ హవా నడుస్తోంది. ఇదే నియోజకవర్గంలో వేలు పెట్టేందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ గ్రూపు ప్రయత్నించింది. భూపతిరెడ్డి, డిఎస్ వర్గాలను ఎమ్మెల్యే వర్గం దూరం పెట్టింది. దీంతో మూడు గ్రూపుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. బోదన్‌, ఆర్మూరు నియోజక వర్గాల్లో కూడా గ్రూపుల గొడవ కవితకు తలనొప్పిగా మారాయి. పదవుల కోసం నేతలు పెడుతున్న డిమాండ్లను ఆమె తీర్చలేకపోతున్నారు. అలాగని సైలెంట్ గా చూస్తూ వదిలెయ్యలేక ఆమె తికమక పడుతున్నారు. ఈ గ్రూప్ తగాదాలు భరించలేక ఆమె రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మారేందుకు చూస్తున్నారు.. అలా కుదరని పక్షంలో అసెంబ్లయీకి పోటీ చెయ్యాలని ఆమె భావిస్తున్నారు. అయితే దీనిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.