సినీ గేయ రచయిత కులశేఖర్ అరెస్ట్   Movie Lyric Writer Kulasekhar Arrest     2018-10-29   09:26:52  IST  Sai M

చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే వంటి 100కు పైగా సినిమాలకు పాటలు రాసిన కులశేఖర్‌.. చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతోనూ కూడా దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. తాజాగా ఓ ఆలయ పూజారి బ్యాగును దొంగిలించిన కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కులశేఖర్‌ పూర్తి పేరు తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్‌ ఆయన స్వస్థలం సింహాచలం. ప్రస్తుతం హైదరాబాద్‌ మోతీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయన.. 3 మూడు రోజుల కిందట ఆర్‌బీఐ క్వార్టర్స్‌ సమీపంలో మాతా దేవాలయం పూజారి బ్యాగును చోరీ చేశాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ ఆలయం వద్ద నిన్న అనుమానాస్పదంగా తిరుగుతుండగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కులశేఖర్‌ నుంచి రూ.50వేల విలువైన 10సెల్‌ఫోన్‌లు, రూ.45వేల విలువైన బ్యాగులు, కొన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి గుడిలో శఠగోపం చోరీ చేసిన కేసులో రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు శిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని వెలివేసింది. అప్పటినుంచి బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్‌, పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.