కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలను తీసుకుంటూ కొత్త నిర్ణయాలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా కేంద్రం బంగారం కొనేవాళ్లకు శుభవార్త చెప్పింది.
బంగారం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి 2021 సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.
కేంద్రం ఈ సంవత్సరం నుంచే గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా అమలు చేస్తోంది.కేంద్రం హాల్ మార్కింగ్ తో పాటు కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ను కూడా అమలులోకి తెస్తోంది.
ఈ నిబంధనలు, యాక్ట్ వల్ల బంగారం విక్రయించే సంస్థలు వినియోగదారులను మోసం చేస్తే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయాలని జువెలరీ దుకాణాలకు వచ్చిన వినియోగదారులకు 18 క్యారెట్ల బంగారం విక్రయించి జువెలరీ సంస్థలు మోసం చేశాయి.ఈ నిబంధనల వల్ల బంగారాన్ని విక్రయించే సంస్థలు బీఐఎస్ కింద రిజిస్టర్ చేసుకోవాలి.బంగారానికి హాల్ మార్కింగ్ ఉండటం వల్ల మరికొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
హాల్ మార్క్ ఉన్న బంగారం స్వచ్చమైన బంగారం అని అర్థం.అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా కొనుగోలుదారులు హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
చాలామంది బంగారాన్ని ఏదైనా కారణాల వల్ల విక్రయించే సమయంలో కొంత మొత్తం నష్టపోతూ ఉంటారు.అయితే హాల్ మార్క్ లేని బంగారంతో పోలిస్తే హాల్ మార్క్ ఉన్న బంగారం ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది.