డిసెంబర్ లో లోక్ సభ రద్దు ..? ముందస్తు కు మోదీ కసరత్తు     2018-09-26   09:19:43  IST  Sai M

దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడం తో పాటు … ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వడం బీజేపీ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల సమయం వరకు వేచి చూస్తే..ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగిపోతుందని అందుకే లోక్ సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే కొంతలో కొంత ఫలితం ఉంటుందనే ఆలోచనలో మోదీ అండ్ కో బ్యాచ్ ఉన్నారు. అందుకే దీనిపై తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ..? అన్న అంశంపై ఓ రహస్య సర్వే కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే .. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్తుల ఎంపిక, ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలకు సమయం ఉంది కదా అని పార్టీలు నెమ్మదిగానే తమ పని తాము చేసుకుంటు పోతున్నారు. అయితే తాజాగా ఏపీకి కూడా కేంద్రం షాకిచ్చేలా ఉంది. తెలంగాణతో పాటు ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు వచ్చే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి.

జమిలి ఎన్నికలు తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం కొంతకాలం క్రితం తీవ్ర కసరత్తు చేసింది. అయితే అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత కొద్ది రోజులు ఈ అంశంపై అంత సైలెంట్ అయిపోయారు. మొదటి నుంచి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలవైపే మొగ్గు చూపుతూ వస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ లోక్‌సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ నిర్ణయం కనుక అనుకున్నట్టు అమలు జరిగితే… నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జనవరిలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈసీకి ఉన్న విచక్షణాధికారాలకు అనుసరించి ఏపీకి కూడా తెలంగాణతోపాటే ఎన్నికలు జరపవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.