2019లో మోడీకి షాక్‌.. విశ్లేషకుల వాదన ఇది       2018-05-31   20:46:25  IST  Bhanu C

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించడంతో దేశ ప్రజలు అంతా కూడా ఆయనకు మద్దతుగా నిలవాలని, దేశంను గుజరాత్‌గా అభివృద్ది చేస్తాడని ఆశించారు. సుదీర్ఘ కాలం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కాకుండా మెజార్టీ ప్రభుత్వం, ఏకైక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రజలు మోడీకి మద్దతుగా నిలిచారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీకి దేశ ప్రజలు సీట్లు కట్టబెట్టారు. ముఖ్యంగా యూపీలో అద్బుతమైన మెజార్టీతో పార్లమెంటు స్థానాలు దక్కాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

నోట్ల రద్దు మరియు జీఎస్టీతో పాటు పలు కొత్త కార్యక్రమాలను మోడీ చేశాడు. నోట్ల రద్దు తర్వాత దేశంలోని నల్లధనం అంతా పోతుందని మోడీ భావించాడు. జీఎస్టీతో భారీగా ప్రభుత్వ ఆధారం సమకూరుతుందని ఆర్థిక నిపుణులతో చెప్పించాడు. అదేం జరగడం లేదు. ఉన్నవారిపై పై నిర్ణయాలు ఈగవాలినట్లుగా కూడా లేదు. కాని పేదవారిపై, మద్య తరగతివారిపై పై నిర్ణయాలు గుదిబండ పడ్డట్లుగా అయ్యింది. ఎన్నో పథకాలు తీసుకు వస్తున్నా కూడా ఏవి కూడా మోడీపై సానుకూల వైఖరిని కలుగ జేయడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 75 శాతం ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటూ సర్వే ఫలితాలు వస్తున్నాయి.

మోడీ వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలే అందుకు సాక్ష్యం అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శణం అంటూ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన అమిత్‌షా పైన కూడా సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీలో సీనియర్లను పక్కన పెట్టడం వంటివి చేయడం వల్ల మోడీ అండ్‌ కోకు వచ్చే ఎన్నికల్లో చుక్కెదురు కానుంది.

వచ్చే ఎన్నికల్లో ఒక వేళ ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లను దక్కించుకున్నా కూడా మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు అంటున్నారు. బీజేపీ నాయకులే మోడీపై వ్యతిరేకంగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు మరియు కొన్ని జాతీయ పార్టీలు కూడా మోడీపై పీకల్లోతు కోపంతో ఉన్నాయి. ఒక వేళ ఎన్డీయేకు మెజార్టీ సీట్లు వస్తే మోడీ కాకుండా మరెవ్వరు అయినా పీఎం అయితే సపోర్ట్‌ ఇస్తామని చెప్పే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేంద్రంలో వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మార్పు మాత్రం ఖాయం అని, మోడీకి ప్రధానిగా అయిదు సంవత్సరాలు మాత్రమే రాసి పెట్టి ఉన్నట్లుందని ఈ సందర్బంగా కొందరు జోకులు వేస్తున్నారు.