మోదీ చేసిన మోసం ... ఇదే జనాగ్రహం !       2018-05-26   04:51:47  IST  Bhanu C

అంతన్నాడు .. ఇంతన్నాడు.. అరచేతిలో స్వర్గం చూపించాడు..చివరికి వచ్చేసరికి జనం చేతిలో చిప్ప పెట్టే పరిస్థితికి వచ్చాడు. గత ఎన్నికల ముందు నమో నమో అంటూ జపం చేసిన జనాలను వెర్రి వెంగళప్పలు చేసి సామాన్యుడు ఈ దేశంలో బతకలేని పరిస్థికి తీసుకొచ్చేసాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ! ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలు మాములుగా లేవు కదా ! ఇవన్నీ ఎందుకు రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసి ప్రజలను కష్టాలపాలు చేసాడు. పై పెచ్చు ఇదంతా మీకోసమే చేశాను. నల్లధనం బయటకి వచ్చేస్తుంది మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసేస్తా అంటూ ఊదరగొట్టేసాడు. చివరికి ఏం చేసాడు ..? ఏమీ చెయ్యలేదు.

నరేంద్రమోదీ మీద జనాలు నమ్మకం కోల్పోయారు. అందుకే ఆయనకు ఉన్న క్రేజ్ బాగా తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. కేంద్రంలో అధికార పీఠం దక్కించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం కన్పించింది. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో గుణాత్మక మార్పు తేవడమే తన జీవిత లక్ష్యమనే వాగ్దానం చేసేసాడు మోదీ. నాలుగు సంవత్సరాలు దాటింది ఎక్కడి పరిస్థితులు అక్కడే ఉన్నాయి. మోడీ మాటలకు మోసపోయామా అన్న భావన జనాల్లో పెరుగుతోంది.

ఇక ఈ నాలుగేళ్లలో బ్యాంకింగ్‌ వ్యవస్థ గాడి తప్పింది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 2018 డిసెంబరు నాటికి అనూహ్యంగా పెరిగి 7 లక్షలకోట్ల రూపాయలకు చేరాయి. మోడీ అధికారంలోకి వచ్చినపుడు ఈ మొత్తం రూ. 2.4 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం తొమ్మిదిన్నర లక్షల కోట్లకు చేరవచ్చునని అంచనా. బ్యాంకింగ్‌ రంగం కుదేలైతే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టం.

జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు పెనుమార్పులు తీసుకొస్తాయని భావిస్తే… అవి కాస్తా ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. పేదల జీవితాలను దుర్భరం చేశాయి. మోడీ హయాంలో దేశ ఆర్థిక చట్రంలో వచ్చిన కీలక మార్పులను చూస్తే.. పెనం నుంచి పొయ్యిలో పడ్డామా అన్న ఆలోచన వస్తోంది జనాలకు.నోట్ల రద్దును సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా అమలు చేయటంతో ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన సొమ్మును కూడా బ్యాంకుల నుంచి తీసుకోలేని విచిత్రమైన చట్రంలో జనం ఇరుక్కున్నారు. బ్యాంకులతో పనిలేకుండా ఏటీఎంలతోనే ఈజీగా బ్యాంకింగ్‌ సేవలు పొందిన జనం.. ఇపుడు ఏటీఎంకు పూలదండలు వేసే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే.. దానికి కారణం మోదీనే

ఆయన తీసుకున్న తల తోక లేని నిర్ణయాలతో .. నాలుగేళ్లలో డాలర్ తో పాలిస్తే… రూపాయి విలువ 16 శాతం పడిపోయింది. అంటే… సుమారు 10రూపాయల మేర తగ్గింది. 58 రూపాయలకు వస్తున్న డాలర్‌ను ఇపుడు కొనాలంటే 68 రూపాయలు చెల్లించక తప్పడం లేదు. శుక్రవారం కూడా రూపాయి విలువ 60పైసలు పెరిగింది. చూస్తుంటే తొందర్లోనే 70కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా చూస్తే సామాన్య, మధ్యతరగతి జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాడనుకున్న మోదీ మార్పులు తీసుకురాకపోగా జనాల్లో నమ్మకం కోల్పోయాడు. రాబోయే ఎన్నికల్లో మోదీ ఎన్ని హామీలు ఇచ్చినా.. ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు.