హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.ఈ నేపథ్యంలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించనున్న భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్ధాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.523.37 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ కారిడార్ నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు మూడున్నర కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది.24 నెలల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఫ్లై ఓవర్ పొడవు 2.580 కిలోమీటర్లు ఉండనుంది.ఈ ఫ్లై ఓవర్ పై రెండువైపులా రాకపోకలు జరిగేలా నాలుగు లేన్లతో నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఒవైసీ జంక్షను వరకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.చంపాపేట, చంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనదారులకుతతతత సమయం ఆదా అవుతోంది.2015లో నిర్వహించిన సర్వేలో ఈ మార్గంలో రద్దీ సమయంలో 70,576 వాహనాలు ప్రయాణించాయి.2035 నాటికి దాదాపు రోజుకు రెండు లక్షల వాహనాల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.