ప్రస్తుత కాలంలో ఎలాంటి సమాచారమైనా ఇంటర్నెట్లో దొరుకుతుండడంతో ప్రజలకి ఇంటర్నెట్ వినియోగం పై అవగాహన బాగానే పెరిగింది. ఎంతలా అంటే తాజాగా ఓ యువకుడు యూట్యూబ్ లో నాటు సారా కాచే విధానం గురించి తెలియజేసే వీడియోని చూసి ఏకంగా నాటు సారాయిని కాచి విక్రయిస్తున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి పాకాల మండలంలో “వంశీ కృష్ణ” అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో కొంతకాలంగా ఇంటి పట్టునే ఉంటున్నాడు.
దీంతో కాలక్షేపం కోసం రోజూ ఎక్కువ సమయాన్ని ఇంటర్ నెట్లోనే గడిపేవాడు.
ఈ క్రమంలో వంశీ కృష్ణ యూట్యూబ్లో నాటు సారా తయారు చేసే విధానం గురించి తెలుసుకున్నాడు.
దీనికితోడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు బాగా పెరగడంతో వంశీకృష్ణ నాటు సారా తయారు చేసి విక్రయించి డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు.
ఇంకేముంది అనుకున్నదే తడవుగా ఓ నాటుసారా బట్టీ ఏర్పాటు చేసుకొని నాటు సారా కాయడానికి కావాల్సిన ముడి సరుకును కొనుగోలు చేసి దర్జాగా నాటు సారాయిని కాస్తున్నాడు.
దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మఫ్టీలో మద్యం కొనుగోలు చేసే వ్యక్తుల మాదిరిగా వెళ్లి వంశీకృష్ణ ని చాక చక్యంగా అదుపులోకి తీసుకొని విచారించగా డబ్బు సంపాదించడం కోసం తానే ఈ పని చేస్తున్నట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం.