ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తూ రోజు రోజుకి తన ప్రతాపాన్ని చూపిస్తోంది.అయితే ఈ కరోనా కారణంగా ప్రభుత్వాలు మనుషులను బౌతిక దూరం పాటించమని చెబుతుండడంతో కొంతమంది తమ పక్కనే ఉన్న మనుషుల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ పట్టించుకోవడం మానేశారు.
తాజాగా ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేవారు లేక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి సత్తెనపల్లి మండలంలో అంకమ్మరావు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై పశుగ్రాసం వ్యాపారం చేసేవాడు.అయితే తాజాగా తన వ్యాపార పని నిమిత్తం బయటికి వెళ్లగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది.అయితే ఈ విషయం గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో కొంతమేర ఆలస్యం అయ్యింది.
అయితే ఇదంతా గమనిస్తున్న స్థానికులు అయ్యో పాపం అంటూ చూస్తూ నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
దీంతో గుండెపోటు అధికమై అంకమ్మరావు అక్కడికక్కడే మృతి చెందాడు.అయితే ఇలాంటి ఘటనలు ఒక్క గుంటూరు లోనే కాదు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చోటు చేసుకున్నాయి.