కళ్యాణ్‌ విషయంలో జరిగిన తప్పును వైష్ణవ్‌ విషయంలో జరగనివ్వరట     2018-07-18   12:27:04  IST  Ramesh Palla

మెగాస్టార్‌ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌కు హీరో అవ్వాలనే కోరిక బలంగా ఉంది. దాంతో అల్లుడు కోరికను తీర్చేందుకు చిరంజీవి తనదైన ప్రయత్నాలు చేశాడు. మొదట అల్లుడికి నటనలో శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత మంచి కథను ఎంపిక చేయమంటూ నిర్మాత సాయి కొర్రపాటికి సూచించారు. సాయి కొర్రపాటిపై నమ్మకంతో ‘విజేత’ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఒక అనామక దర్శకుడు అయిన రాకేష్‌ శశి చేతిలో కళ్యాణ్‌ను పెట్టడం జరిగింది. గతంలో ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా ద్వారా కూడా ఈ దర్శకుడు పర్వాలేదు అనే టాక్‌ను దక్కించుకోలేక పోయాడు. దాంతో ‘విజేత’ చిత్రం విజయాన్ని అందుకోవడంలో విఫం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథా, కథనాలతో సినిమా మెగా పరువు తీసేసింది.

మెగాఫ్యామిలీ నుండి మూవీ అనగానే మెగా ఫ్యాన్స్‌ చాలా ఆశలు, అంచనాలు పెంచుకుంటారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ కూడా చాలా నిరుత్సాహం వ్యక్తం చేశారు. కళ్యాణ్‌ మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో కొన్ని సినిమాలు వచ్చి సక్సెస్‌ అయ్యే వరకు ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక హీరో మొదటి సినిమా సక్సెస్‌ అయితే ఆ హీరో కెరీర్‌లో స్టార్‌ ఇమేజ్‌ను దక్కించుకుంటాడు. అదే ఫ్లాప్‌ అయితే ఎంత మంచి సినిమాలు చేసినా కూడా స్టార్‌డం మాత్రం దక్కించుకోలేడు. అందుకే రాబోయే మెగా హీరోల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి మెగా ఫ్యామిలీ వచ్చింది.

Megastar Wants To Launch One More Mega Hero-

Megastar Wants To Launch One More Mega Hero

కళ్యాణ్‌ దేవ్‌ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్‌ మరో మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ వెండి తెర అరంగేట్రంకు సిద్దం అవుతున్నాడు. వైష్ణవ్‌ తేజ్‌ ఇప్పటికే నటన మరియు డాన్స్‌లలో ప్రావిణ్యం సంపాదించాడు. కాస్త లావు ఎక్కువగా ఉండే వైష్ణవ్‌ సినిమాల కోసం చాలా తగ్గాడు. హీరో లుక్‌ కోసం ప్రత్యేక ట్రైనర్‌ ఆధ్వర్యంలో కసరత్తులు చేయడం జరిగింది. ‘విజేత’ సక్సెస్‌ అయితే వైష్ణవ్‌ ఎంట్రీ బాధ్యతలను సాయి కొర్రపాటికి ఇవ్వాలని మెగా కుటుంబం భావించింది. కాని విజేత ఫ్లాప్‌ అవ్వడం, సాయి కొర్రపాటికి నష్టాలు రావడంతో వైష్ణవ్‌ను వేరే నిర్మాత చేతిలో పెట్టబోతున్నారు.

ఇటీవలే ‘నేలటికెట్‌’ చిత్రాన్ని నిర్మించిన రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో వైష్ణవ్‌ను పరిచయం చేయబోతున్నారు. పవన్‌కు ఆప్తుడు అవ్వడం వల్ల రామ్‌కు ఈ అవకావం దక్కింది. ఇక విజేత విషయంలో జరిగిన తప్పును అదే కథ మరియు దర్శకుడు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుర్తింపు ఉన్న దర్శకుడిని ఎంపిక చేయడంతో పాటు, మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే కథను ఎంపిక చేయాలని మెగా కాంపౌండ్‌ నిర్ణయించింది. అందుకోసం అప్పుడే చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. విజేత ఫ్లాప్‌కు గల కారణాలు అన్వేషించి వైష్ణవ్‌ ఎంట్రీకి వాటిని అధిగమించాలని భావిస్తున్నారు. చిరంజీవి తన మేనల్లుడిపై ప్రత్యేక శ్రద్ద పెట్టబోతున్నాడు. పవన్‌ కూడా మేనల్లుడికి మద్దతుగా నిలిచేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.