గతంలో ప్రజారాజ్యం స్థాపించి అధికారం చేపట్టే అంతటి స్థాయిలో ప్రభావం చూపించగలిగినా, చివరకు ఎన్నికల ఫలితాలు తేడా రావడం మెగా స్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానానికి మధ్యలోనే బ్రేక్ పడిపోయింది.ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి రాజ్య సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చిరు పనిచేసినా ఆయనకు, ఆయన అభిమానులకు ప్రజారాజ్యం తాలూకా అవమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
ఇక ప్రజారాజ్యం పార్టీతో చిరు పొలిటికల్ కెరియర్ డౌన్ పాల్ కావడం, అనేక అవమానాలకు గురి అవడంతో పాటు, మెగా అభిమానులను, సొంత సామాజికవర్గ నేతలను ఆ నిరాశ నుంచి బయటపడేసేందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
కానీ ప్రజారాజ్యం స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి మద్దతుగా ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి కానీ, జగన్ కు మద్దతు ఇవ్వవలసిందిగా కోరడం కానీ చేయలేదు.
జనసేన కు తనకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.కాకపోతే జనసేన నాయకులు మాత్రం ఎప్పటికైనా జనసేనలోకి వస్తారని, ఆ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరిస్తారు అని పదేపదే చెబుతూ వస్తున్నారు.
తాజాగా ఈ రోజు విజయవాడలో బీజేపీ, జనసేన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చిరు పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే చిరంజీవి జనసేన లో చేరబోతున్నారని, ఆ పార్టీకి మద్దతుగా ప్రచారానికి దిగబోతున్నారు అని, ఇదంతా త్వరలోనే ఉండబోతుంది అంటూ ప్రకటన నాదెండ్ల మనోహర్ చేయడం ఒక్కసారిగా రాజకీయ సంచలనంగా మారింది.
దీనిపై చిరంజీవి వైపు నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు , తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన నాయకులు, మెగా అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.