మెగా హీరోల ఎంట్రీకి కొత్త ఫార్ములా       2018-05-05   02:09:33  IST  Raghu V

మెగా ఫ్యామిలీ నుండి లెక్కలేనంత మంది హీరోలు వరుసగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. అదే దారిలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన హీరోగా ఇప్పటికే రాకేష్‌ శశి అనే దర్శకుడు ఒక చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌ లేదా నవంబర్‌లో కళ్యాణ్‌ మూవీ విడుదల చేయబోతున్నారు. కళ్యాణ్‌ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్టవ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన రెండు సంవత్సరాలుగా నటన మరియు ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.

మెగాస్టార్‌ మేనల్లుడు అయిన వైష్ణవ్‌ హీరోగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాకు రంగం సిద్దం అయ్యింది. మెగా హీరోలకున్న పేరు మరియు పరపతితో స్టార్‌ దర్శకు దర్శకత్వంలో, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేయగలరు. కాని అందరు కూడా స్టార్‌ దర్శకుల ద్వారా పరిచయం అయితే వారికి వెంటనే స్టార్‌డం రావడం, ఆ తర్వాత వారు చేసే సినిమాలు ఆకట్టుకోక పోవడం జరుగుతున్నాయి. అందుకే మొదట చిన్న చిత్రాలు, చిన్న దర్శకులతో చేసి ఆ తర్వాత పెద్ద చిత్రాలను పెద్ద దర్శకులతో చేయాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించింది. అందుకే ఇలా కొత్త దర్శకుతో, చిన్న దర్శకులతో మంచి కథలు ఎంపిక చేసి కళ్యాణ్‌ మరియు వైష్ణవ్‌ను పరిచయం చేస్తున్నారు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న అవసరాల శ్రీనివాస్‌ ఒక మంచి స్టోరీ లైన్‌ను వైష్ణవ్‌ కోసం రెడీ చేయడం జరిగింది. ఆ కథ త్వరలోనే చిరంజీవి కూడా వినబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ లైన్‌కు చిరంజీవి ఓకే చెప్పడం జరిగింది. పూర్తి కథను చిన్న చిన్న మార్పులతో చిరంజీవి ఫైనల్‌ చేస్తాడనే టాక్‌ వినిపిస్తుంది. చదువు పూర్తి చేసిన వైష్ణవ్‌ అన్నదారిలో మంచి మాస్‌ హీరో అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. అయితే అందుకోసం హడావుడి లేకుండా కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలని మెగా ఫ్యామిలీ పెద్దలు అతడికి సలహా ఇస్తున్నారు.

చిరంజీవి దారిలో ఇప్పటి వరకు పవన్‌, నాగబాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, శిరీష్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, కళ్యాణ్‌లు నటులుగా మారారు. వారు అంతా కూడా చిరంజీవి పరువు నిలుపుతూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా వైష్ణవ్‌ కూడా అదే దారిలో నడిచి మామకు తగ్గ అల్లుడు అనిపించుకుని, మంచి సినిమాలు చేయాలని అంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఈయన మెగా ఫ్యాన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.