సైరా కంటే దీన్నే ఎక్కువ కోరుకుంటున్నారు       2018-06-05   00:00:46  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ఇంకా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ఉండటం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు సైరా కంటే కూడా అధికంగా కొరటాల శివ, చిరుల మూవీ గురించి ఎదురు చూస్తున్నారు.

చేసిన ప్రతి సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేసుకుంటూ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, జక్కన్న తర్వాత స్థానంలో అంటే నెం.2 స్థానంలో ఉన్న కొరటాల శివ, చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎప్పటికప్పుడు సినిమా గురించి తొసుకునేందుకు మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా ఆసక్తి కనబర్చుతున్నారు. చిరంజీవి, కొరటాల శివల కాంబో మూవీ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘సైరా’ కంటే ఎక్కువ క్రేజ్‌ను కలిగి ఉంది.

సైరా కంటే కూడా ముందుగానే కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా వచ్చే అవకాశాలున్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కాని, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి, కొరటాల శివ సినిమాలో డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. హీరోను అత్యంత స్టైలిష్‌గా, హీరోయిజంను అద్బుతంగా చూపించగల దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో చిరంజీవి డబుల్‌ రోల్‌ అంటే రచ్చ మామూలుగా ఉండదు అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. మొన్నటి వరకు సైరా చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్‌ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే భరత్‌ అనే నేను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు బ్రేక్‌ చేసిన కొరటాల శివ మరోసారి టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో తాను తెరకెక్కించిన చిత్రాన్ని చేర్చాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈయన చేస్తున్న అన్ని సినిమాలు కూడా రికార్డులు బ్రేక్‌ చేస్తున్నవి. ఆ కారణంగానే చిరంజీవితో చేయబోతున్న సినిమా కూడా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉండి, ప్రస్తుతం వీరి సినిమాను అధికంగా కోరుకుంటున్నారు.