మెగా ఫ్యామిలీ అంతా దిగబోతుందట!  

  • మెగా ఫ్యామిలీ హీరో సినిమా ఫంక్షన్‌ అంటే మెగా హీరోలు హాజరు అవుతారనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇద్దరు, ముగ్గురుకు మించి మెగా హీరోలు కనిపిస్తారు. ఇప్పుడు కళ్యాణ్‌ హీరోగా పరిచయం కాబోతున్న ‘విజేత’ మూవీ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా కదిలి రాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రిజ భర్త అయిన కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కిన విషయం తెలిసింది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కావచ్చింది. సినిమాను జులైలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

  • -

  • ఇటీవలే ‘విజేత’ ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుకను భారీ మెగా వేడుకగా నిర్వహించాలని నిర్మాత సాయి కొర్రపాటి కోరుకుంటున్నాడు. అందుకోసం చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, నాగబాబు, వరుణ్‌ తేజ్‌, నిహారిక ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ నుండి హాజరు కాబోతున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పవన్‌ కళ్యాణ్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌లో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ఫ్యామిలీ నుండి ఏ హీరో పరిచయం కాబోతున్నా కూడా ఇలాగే గ్రాండ్‌గా ఎంట్రీ ఉంటుంది.

  • చిరంజీవి సొంత అల్లుడు అవ్వడంతో కళ్యాణ్‌కు మరింత ప్రాముఖ్యత దక్కుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న కళ్యాణ్‌ దేవ్‌ మూవీ ‘విజేత’ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కళ్యాణ్‌ కెరీర్‌కు చక్కని రూట్‌ వేయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి మరియు అల్లు అరవింద్‌లు ప్రత్యేక శ్రద్ద కనబర్చి మరీ సినిమాను చేయించారు. రాకేష్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించినా కూడా అల్లు అరవింద్‌ ఎక్కువగా ఈ చిత్రం కోసం సమయం కేటాయించాడు.

  • చిరంజీవి కోరిక మేరకు పలు సార్లు అల్లు అరవింద్‌ రషెష్‌ చూసి, వాటిలో తప్పుఒప్పులను సరిదిద్దడంతో పాటు, పలు సీన్స్‌ విషయంలో దర్శకుడికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ కూడా చేయించారు. ఇలా సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో మెగా ఫ్యామిలీ హస్తం ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేందుకు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆడియో ఫంక్షన్‌ రోజున రంగంలోకి దిగబోతున్నారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియోను ఈనెల 24న హైదరాబాద్‌లో ప్రముఖ కన్వెన్షన్‌ సెంటర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.