‘ఆఫీసర్‌’పై మెగా ఎఫెక్ట్‌.. భయపడుతున్న వర్మ     2018-05-29   23:06:58  IST  Raghu V

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం జూన్‌ 1న విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఎ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంపై సెన్సార్‌ బోర్డు వారు పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రం విడుదల తర్వాత సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడంతో పాటు, వెబ్‌ మీడియాలో వ్యతిరేకంగా రాసి మెగా ఫ్యాన్స్‌ సినిమాను కిల్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆమద్య పవన్‌కు వ్యతిరేకంగా శ్రీరెడ్డితో స్వయంగా వర్మ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయించిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్‌ ఇప్పుడు పడే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌పై గత కొంత కాలంగా వర్మ కక్ష సాధిస్తున్నాడు అని, అది ఇప్పుడు తారా స్థాయికి చేరింది అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫ్యాన్స్‌ అంతా కూడా వర్మను తెలుగు సినిమా పరిశ్రమ నుండి బహిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు. ఆ విషయాన్ని సినిమా పరిశ్రమ మీటింగ్‌లో కూడా చర్చించారు. అయితే వర్మ పదే పదే క్షమాపణలు చెప్పడంతో పరిశ్రమ పెద్దలు మెగా ఫ్యామిలీకి నచ్చ జెప్పినట్లుగా తెలుస్తోంది.

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని విడుదల కానిచ్చేది లేదు అంటూ ఆ సమయంలో మెగా ఫ్యాన్స్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఆ సంఘటన జరిగి వారాలు, నెలలు గడిచేస్తోంది. ఇప్పుడు ఆ విషయమై మళ్లీ చర్చ మొదలైంది. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ‘ఆఫీసర్‌’ చిత్రంను టార్గెట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ భావిస్తున్నాడు. సోషల్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌ కొందరు చాలా యాక్టివ్‌గా ఉంటూ, తమ హీరోలపై ఎవరైనా కామెంట్స్‌ చేస్తే చీల్చి చెండాడేస్తారు.

ఆమద్య కత్తి మహేష్‌, ఆ తర్వాత శ్రీరెడ్డిలపై ఎలాంటి ప్రతీకారంను మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తీర్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ‘ఆఫీసర్‌’ చిత్రంపై కూడా మెగా ఫ్యాన్స్‌ బ్యాడ్‌ టాక్‌ను క్రియేట్‌ చేయబోతున్నట్లుగా వర్మకు సమాచారం అందింది. ఈ చిత్రానికి నిర్మాత అయిన వర్మ కాస్త టెన్షన్‌ పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వర్మ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రంను నాగార్జున కూడా కాపాడటం కష్టమే అంటున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగ్‌ ఫ్యామిలీ, చిత్ర యూనిట్‌ సభ్యులు తప్ప ఇండస్ట్రీ నుండి ఎవరు రాలేదు. అంటే మెగా ఫ్యామిలీకి భయపడే అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘ఆఫీసర్‌’ ఎలా నెగ్గుకు రాగలడు అనేది చూడాలి.