ప్రస్తుత కాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకొనేటువంటి నిర్ణయాలు తమ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే కడప జిల్లాకు చెందిన పెద్దముడియంమండలంలోని ఓ గ్రామంలో పుష్పలత అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉంటోంది.అయితే ఈమె స్థానికంగా ఉన్నటువంటి సచివాలయంలో ఏఎన్ఎం నర్సుగా విధులు నిర్వహిస్తోంది.
గత కొద్దికాలంగా పుష్పలత తన భర్తతో మనస్పర్థలు మరియు విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది.దీంతో పుష్పలత భర్త ఆమెను అనుమానిస్తూ రోజు ఇంటికి వచ్చి చిత్రహింసలకు గురిచేశాడు.
ఈ అనుమానం రోజురోజుకి ఎక్కువవడంతో తాజాగా ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఆమెను బలంగా గాయపరిచాడు.ఇది గమనించిన ఇతర కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ, గాయాలు బలంగా తగలడంతో పుష్పలత అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో పుష్పలత కుటుంబ సభ్యులు బోరున విలపించారు.అంతేగాక తల్లి దారుణ హత్యకు గురవడం, తండ్రి కటకటాల పాలవ్వడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.