నిన్న అమృత, నేడు మాధవి..! ప్రణయ్ హత్య మరువకముందే మరో ప్రేమజంట పై పరువు హత్యాయత్నం.!     2018-09-20   08:28:15  IST  Sainath G

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే అలాంటి ఘటన హైదరాబాద్ లోనూ చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో తెగనరికాడు. అల్లుడు, కుమార్తెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. అల్లుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

వివరాలలోకి వెళ్తే… 10వ, తరగతి నుండే మాధవి, సందీప్‌లు ప్రేమించుకొంటున్నారు. కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని మాధవి తండ్రి మనోహర చారి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాధవి, సందీప్‌ల ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు. అయితే సందీప్, మాధవిల ప్రేమ విషయం గురించి 2013 నుండి కొనసాగుతోంది. ఈ ప్రేమ విషయం తెలిసిన సందీప్ సోదరుడు ఈ విషయమై సందీప్ ను వారించాడు. మేజర్‌ అయ్యే వరకు సందీప్ ను సోదరుడు వారించాడు.

వారం క్రితం ఇద్దరూ ఒక గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాధవి తల్లిదండ్రులు సందీప్ ఇంటికి వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిరోజు మాధవి తండ్రి మనోహర చారి వీరి వద్దకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తనపై ఎవరికీ అనుమానం రాలేదు. ప్రేమ పెళ్లికి ఆయన అంగీకరించారనే అందరూ సంతోషపడ్డారు. ఈరోజు ఇద్దరికీ ఫోన్ చేసి రావాలని మాధవి తండ్రి పిలిచాడు. వారు వచ్చిన తర్వాత ఇంతటి ఘోరానికి తెగబడ్డాడు. తమ కన్నా తక్కువ కులం వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే… ఇద్దరినీ చంపేందుకు ఆమె తండ్రి యత్నించాడు.