మనీషా కొయిరాలా కాన్సర్ ను ఎలా జయించారో తెలుసా.? ఆమె రాసిన బుక్ లో ఉన్న విషయాలివే.!  

“తెలుసా..మనసా…ఇది ఏనాటి అనుబంధమో” ఈ పాట గుర్తుందా..? నాగార్జున నటించిన “క్రిమినల్” సినిమాలోని లవ్ సాంగ్. ఈ సాంగ్ లో “మనీషా కొయిరాలా” ఎంతో అందంగా కనిపించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో “మనీషా కొయిరాలా” తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యింది. తర్వాత “ఒకే ఒక్కడు” లో పల్లెటూరి అమ్మాయిలాగా “అర్జున్” ను “ఉమ్మా అడిగింది”. “నెల్లూరి నెరజాణ” అని పాటకూడా పాడించుకుంది. ఎంతో మందికి ఆ పాట ఫేవరెట్ గా నిలిచింది. “భారతీయుడు, బాంబే” చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది!

Manisha Koirala Unveils Cover Of Her Upcoming Book 'Healed'-Battle With Cancer Healed

Manisha Koirala Unveils Cover Of Her Upcoming Book 'Healed'

నేపాలీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన “మనీషా కొయిరాలా” ఎంతో మంది స్టార్ హీరోస్ సరసన ఎన్నో “హిందీ, తెలుగు, తమిళ్” సినిమాల్లో నటించింది. ఆడియన్స్ ప్రశంసలే కాదు అవార్డులు కూడా అందుకున్నారు “మనీషా కొయిరాలా”. ఇటీవల “కాన్సర్” తో ఇబ్బంది పడ్డారు. ఏడేళ్ల పాటు క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సను భరించారు. ఆత్మవిశ్వాసంతో తిరిగి మామూలు వ్యక్తిగా ఇటీవలే వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. సంజయ్‌దత్‌ బయోపిక్‌ ‘సంజూ’ చిత్రంలో మెరిశారు. ‘లస్ట్‌స్టోరీస్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ మెప్పించారు. తాజాగా తన క్యాన్సర్‌ అనుభవాలను ‘హీల్డ్‌’ పేరిట పుస్తకంగా తెచ్చారు మనీషా కొయిరాలా.

Manisha Koirala Unveils Cover Of Her Upcoming Book 'Healed'-Battle With Cancer Healed

‘మా ఇంట్లో నా కంటే ముందే కొంత మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. కానీ ‘నాకేం అవుతుందిలే అనే ధైర్యం’తోనే ఉన్నా. పదమూడేళ్ల క్రితం… అంటే 2005లో నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. నా ధైర్యం ఆవిరైన క్షణం కూడా అదే. అప్పుడు నా స్వస్థలం నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్నా. అప్పుడప్పుడు అనారోగ్యం బారిన పడేదాన్ని. వయసు మీద పడటంతో నా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయేమో అనుకున్నా. ఏది తిన్నా వాంతులు అయ్యేవి. క్రమంగా నా రోగ నిరోధకశక్తి దెబ్బతినడం మొదలుపెట్టింది. వెంటనే ముంబయి వచ్చేశా. జస్‌లోక్‌ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ సురేశ్‌ ఆడ్వాణీని కలిశాను. నా పరిస్థితి వివరించాను. చెకప్‌ చేయించుకున్నా. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అండాశయ క్యాన్సర్‌ చాలా అడ్వాన్స్‌డ్‌ స్టేజీలో ఉందని తేలింది. అప్పటికే మా అమ్మ అమెరికాలో తెలిసిన వైద్యులతో మాట్లాడటం మొదలుపెట్టింది. అమెరికాలోని స్లోయారిన్‌ కెట్టరింగ్‌ ఆసుపత్రిలో నా క్యాన్సర్‌కు చికిత్స మొదలైంది.

Manisha Koirala Unveils Cover Of Her Upcoming Book 'Healed'-Battle With Cancer Healed

శరీరంలోకి కీమోను అధిక మోతాదులో పంపించేవారు. అందుకే ఇక అదనంగా మందులు వాడటం మానేశాను. నా తమ్ముడు ఇచ్చిన ఆక్యుప్రెజర్‌ రిస్ట్‌ బ్యాండ్‌ కొన్నాళ్లు బాగానే పనిచేసింది.. అమ్మ ఒక్కోసారి అల్లం పచ్చడి తినిపించేది. ఇవి కూడా పనిచేయకపోతే అప్పుడు మందుల జోలికి వెళ్లేదాన్ని. కొన్నాళ్లు బాగానే ఉండేది. మరికొన్ని రోజులు ఎంతో బాధను అనుభవించాను. ముఖ్యంగా న్యూపోజెన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చినప్పుడు నరకం కనిపించేది.

Manisha Koirala Unveils Cover Of Her Upcoming Book 'Healed'-Battle With Cancer Healed

క్యాన్సర్‌ నుంచి బయటపడటానికి మనకు కావాల్సిన లక్షణం భయపడకపోవడం. ‘వన్‌నెస్‌’ అనే విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్‌ మెడిటేషన్‌ కోర్సు కూడా చేశా. నమన్జీ అనే ప్రొఫెసర్‌ నాకు స్కైప్‌లో మెడిటేషన్‌ గురించి చెప్పేవారు. ఆయన ముందుగా చెప్పిన ఒకే మాట… ‘భయాన్ని పోగొట్టుకో’మన్నారు. చావు ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పారు. నాకది సబబుగానే అనిపించింది.

క్యాన్సర్‌తో మనీషా కొయిరాలా యుద్ధం ముగిసి ఆరేళ్లు. రచయిత్రి, జాతీయ అవార్డు గ్రహీత నీలమ్‌ కుమార్‌తో కలిసి ‘హీల్డ్‌’ (పెంగ్విన్‌ ప్రచురణ) పుస్తకాన్ని రచించారు మనీషా. ‘హౌ క్యాన్సర్‌ గేవ్‌ మి ఎ న్యూ లైఫ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, క్యాన్సర్‌ను ఎదుర్కొన్న తీరును ఈ పుస్తకంలో ఆమె వివరించారు