చంద్రబాబు హ్యాండ్సమ్‌ సీక్రెట్ చెప్పిన మంచు ల‌క్ష్మి     2017-01-09   01:48:03  IST  Bhanu C

అర‌వై ఏళ్లు పైబ‌డిన వ‌య‌సు.. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం.. ఒక రాష్ట్రానికి సీఎం!! నిత్యం అధికారుల‌తో స‌మావేశాలు.. మ‌రోప‌క్క వ‌రుస స‌మీక్ష‌లు! క‌నీసం కుటుంబ స‌భ్యుల‌తోనూ ఆనందంగా గ‌డిపేందుకు తీరిక‌లేని ఊపిరి స‌ల‌ప‌ని ప‌నులు! ఇదీ స్థూలంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దిన‌చ‌ర్య‌! మ‌రి ఈ వ‌య‌సులోనూ ఆయ‌న ఎంతో ఆరోగ్యంగా, హ్యాండ్స‌మ్‌గా ఉండ‌గలుగుతున్నారు! అయితే ఇందుకు గ‌ల సీక్రెట్‌ను సినీ న‌టి మంచు ల‌క్ష్మి బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుకుల జీవితంలో ఎవ‌రూ ఆరోగ్యంపై స‌రైన శ్ర‌ద్ధ తీసుకోవ‌డం లేదు. అందుకే ఆరోగ్యం, వ్యాయామంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విజ‌య‌వాడ‌లో ఆదివారం జియో అమరావతి మారథాన్ నిర్వ‌హించారు. ఇందులో మంచుల‌క్ష్మితో పాటు మంత్రులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మి మాట్లాడుతూ.. జీవ‌న‌విధానంలో వ‌చ్చిన మార్పుల‌తో ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. సీఎం చంద్రబాబు నిత్యం వ్యాయామం చేయడం వల్లనే చాలా హ్యాండ్సమ్‌గా, స్ట్రాంగ్ గా ఉన్నారని ఆమె కితాబిచ్చారు.

మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం ఏప్రిల్‌ నుంచి మొదలవుతుందన్నారు. ప్రజలు ఆనందంగా ఉంటేనే ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ అంతర్జాతీయ స్థాయి వెళ్లడానికి ఈ మారథాన్ లు ఉపయోగపడతాయన్నారు. మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ మారథాన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇటువంటి మారథాన్ లు మరిన్ని జరగాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డీజీపీ, విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ పాల్గొన్నారు.