చిత్రం : మనమంతా
బ్యానర్ : వారాహి చలనచిత్రం
దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత : సాయి కొర్రపాటి
సంగీతం : మహేష్ శంకర్
విడుదల తేది : ఆగష్టు 5, 2016
నటీనటులు : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావు తదితరులు
ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, సాహసం వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.ఆయన సినిమా అంటే క్లాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి.
అలాంటి చంద్రశేఖర్ యేలేటి ఈసారి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అలనాటి అందాల నటి గౌతమిలతో “మనమంతా” అనే చిత్రాన్ని రూపొందించారు.మరి మనమంతా ఆద్యంతం ఎలా సాగిందో ఓసారి చూడండి.
కథలోకి వెళ్తే …
ఇందులో ప్రధానంగా నాలుగు పాత్రలు, నాలుగు కథలు ఉంటాయి.ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ, జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశపడే మామూలు వ్యక్తి సాయిరామ్ (మోహన్ లాల్).
అలాంటి మరో మధ్యతరగతి గృహిణి గాయత్రి (గౌతమి).తన భర్త, పిల్లలకోసం ఎప్పుడు తపించే మరో సాధారణ మహిళ.
మహిత (రైనా రావు) తనకు చేతనైనంతలో అందరికి సహాయం చేయాలనే మనస్తత్వం కలిగిన ఓ పసిహృదయం తను.ఆభిరామ్ (విశ్వాంత్) ఒక సగటు కాలేజీ కుర్రాడు.ఇతని ప్రేమలో సమస్యలు చదువుపై ప్రభావం చూపుతుంటాయి.
నాలుగు పాత్రల జీవితాలు తమ తమ పద్ధతుల్లో, తమ తమ ప్రపంచంలో సాగిపోతూ ఉంటాయి.కాని అనుకోని విధంగా వీరి కథలు ఊహించని మలుపులు తీసుకుంటాయి.ఆ మలుపులు ఏంటి ? వీరి కథలు చివరికి ఎక్కడికి చేరాయి అనేది తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన గురించి
కంప్లీట్ యాక్టర్ అనే పేరు సంపాదించుకున్న మోహన్ లాల్ లాంటి గొప్ప నటుడి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.ఆయన సినిమాలు చేస్తున్నందుకు మలయాళ సీనీ ఇండస్ట్రీ ఏదో పుణ్యం చేసుకోనే ఉంటుంది.“మనమంతా” మోహన్ లాల్ నటనా ప్రయాణంలో మరో మైలురాయి.ఓ మధ్య తరగతి ఆశావాదిగా ఆయన తన పాత్రను రక్తికట్టించిన తీరు అద్భుతం.
గౌతమి చాలారోజుల తరువాత తెలుగుతెరపై కనిపించారు.పరిణితి చెందిన హావాభావాలు, ఎక్కడా శృతిమించని నటనతో ఆకట్టుకున్నారు.
రైనా రావు ముద్దుగా, అందమైన ముఖ కదలికలతో మురిపించింది.విశ్వాంత్ కేరింతతో పోల్చుకుంటే చాలా మెరుగయ్యాడు.
సాంకేతికవర్గం పనితీరు
కెమెరా వర్క్ చిన్నపాటి మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి.ఎడిటింగ్, ఆర్ట్ డిపార్టుమెంట్స్ తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించాయి.
సినిమా సహజంగా కనిపించండంలో ఆర్ట్ డైరెక్టర్ రవీంద్రది పెద్ద చేయి.మహేష్ శంకర్ సంగీతం బాగుంది.
కమర్షియల్ హంగులు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, సందర్భానుసారంగా చక్కటి సంగీతాన్ని అందించాడు.
ఇక దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి కొత్తగా చెప్పేదేముంది.
ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఎంత కొత్తగా, చక్కగా ఉంటుందో చెప్పడానికి మనమంతా మరో ఉదాహరణ.ప్రొడక్షన్ వాల్యూస్ ఫర్వాలేదు.
విశ్లేషణ :
మొన్న పెళ్ళిచూపులు, ఇప్పుడు మనమంతా.తెలుగు సినిమా సహజత్వానికి దగ్గరగా వెళుతోంది అని చెప్పడం తొందరపాటే అవుతుంది కాని, వారం వ్యవధిలో రెండు కొత్తరకమైన సినిమాలు ఇలాంటి కమర్షియల్ ఇండస్ట్రీలో రావడం గొప్ప విషయమే.
మొదటినుంచి మిగితా దర్శకులకి భిన్నంగా, నూతనత్వం, సహజత్వాన్ని నమ్ముకున్నారు చంద్రశేఖర్ యేలేటి.ఈ సినిమా కూడా ఆయన స్టైల్లోనే ఉంది.
పాత్రలన్ని మనం రోజూ చూసేవి.మనలోనే ఓ సాయిరామ్ ఉంటాడు, మనలోనే ఓ గాయత్రి ఉంటుంది.
మన ఫ్రెండ్ లాంటి పాత్రే అభిరామ్.ఇక మహిత లాంటి పిల్లలు మనకు కనబడుతూనే ఉంటారు.
చెప్పుకోవడంలోనే సహజత్వం ఉంది.అదే చంద్రశేఖర్ మహిమ.
ఆకాశాన్ని తెచ్చి చూపెట్టలేదు, లేని అద్భుతాన్ని సృష్టించలేదు.కాని ఒక మంచి సినిమా తీసారు.
మల్టిప్లెక్స్, ఏ సెంటర్ల ప్రేక్షకుల అండదండలతోనే ఈ సినిమా ఆడాలి.ఇలాంటి చిత్రాలు మాస్ ప్రేక్షకులకి నచ్చుతాయన్న గ్యారంటీ లేదు.
హైలైట్స్ :
* మోహన్ లాల్
* పాత్రలు, నటన
* కథ, స్క్రీన్ ప్లే
* సస్పెన్స్
డ్రాబ్యాక్స్ :
* నవ్వంచడానికి చేసిన కొన్ని ప్రయత్నాలు
* అందరికి నచ్చకపోవచ్చు
చివరగా :
మనమంతా ఒక్కసారైనా “మనమంతా” చూడాలి