మాట వరసకు అన్నారు.. పట్టించుకోమాకు       2018-06-21   04:21:54  IST  Raghu V

సినిమా పరిశ్రమలో స్టార్‌ హీరోలు కొన్ని సార్లు రాజకీయ నాయకు మాదిరిగా హామీలు ఇస్తూ ఉంటారు. హీరోలు మాత్రమే కాదు దర్శకులు నిర్మాతలు కూడా హామీలు ఇస్తూ ఉంటారు. తమ సినిమాలో కీలక పాత్రకు ఛాన్స్‌ ఇస్తాం అని, సహాయ దర్శకుడిగా తీసుకుంటాను అని, నీతో సినిమా చేస్తాను అంటూ ఇలా పలువురు పలు రకాలుగా హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలు వారికి ఎంత వరకు గుర్తు ఉంటాయో ఆ దేవుడికే ఎరుక. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఇచ్చే హామీలు దాదాపు 70 శాతం అమలుకు నోచుకోవు అనే విషయం గతంలో పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి మరియు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబులు దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాలు చేస్తామంటూ హామీ ఇచ్చారట. తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈయన దర్శకత్వంలో పలువురు యువ హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కాని చిరంజీవి, మహేష్‌బాబులు కూడా తనతో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పుకొచ్చాడు.

సుధీర్‌బాబు నటించిన సినిమా అవ్వడంతో మహేష్‌బాబు ఈ సినిమాను తప్పక, తప్పనిసరి పరిస్థితుల్లో చూడటం జరిగింది. ఆ సమయంలోనే మాట వరసకు సినిమా చాలా బాగుంది, నా కోసం ఒక స్క్రిప్ట్‌ తయారు చేయండి, తప్పకుండా ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడట. వీరిద్దరి కాంబోలో సినిమాకు అవకాశమే లేదని, అసలు ఇద్దరి విభిన్న శైలికు సినిమా సూట్‌ అవ్వదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్‌బాబు ఏదో మాట వరకు అన్నాడు అని, దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అంటున్నారు.

అచ్చు అలాగే చిరంజీవితో కూడా జరిగింది. ఇటీవలే కొన్ని కారణల వల్ల సమ్మోహనం చిత్రాన్ని చూసిన చిరంజీవి ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించడం జరిగింది. మంచి కథతో సినిమాను చేశారు అంటూ ప్రశంసించారు. అలా చిరంజీవి మరియు మహేష్‌బాబులు ఇద్దరు కూడా సినిమాలు చూసి బాగున్నాయని చెప్పడంతో పాటు, నా కోసం కూడా సినిమా కథను సిద్దం చేయండి అంటూ కోరారు. వారిద్దరు కూడా మాట వరకు అన్నారు కాని, నిజంగా వారు ఇంద్రగంటితో సినిమా చేస్తారా అనేది అనుమానమే.