గడ్డం, మీసాలు.. కాస్త కష్టంగానే ఉంది       2018-06-10   22:12:19  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. మహేష్‌బాబుకు అది 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వంశీ భారీ ఎత్తున సినిమాను చేసేందుకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు. దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తన గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో మహేష్‌బాబు చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు తన ప్రతి సినిమాలో కూడా క్లీన్‌ షేవ్‌తో కనిపించిన మహేష్‌బాబు, ఇప్పుడు గడ్డంతో కనిపించబోతున్నాడు.

మహేష్‌బాబును ఇప్పటి వరకు గడ్డంలో చూడని ప్రేక్షకులు ఆయన గడ్డంతో ఎలా ఉంటాడో అని చూడాలని తెగ ఆరాటపడ్డారు. ఆయన ఫ్యాన్స్‌ గడ్డంతో ఉన్న చిన్న ఫొటోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. తాజాగా మహేష్‌బాబు గడ్డం లుక్‌ అధికారికంగా రివీల్‌ అయ్యింది. తాజాగా తన బావ సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘సమ్మోహనం’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌బాబు గడ్డంతో కనిపించాడు. పూర్తి స్థాయి గడ్డం లుక్‌తో కెమెరా ముందుకు వచ్చిన మహేష్‌బాబును చూసిన ప్రేక్షకులు మరియు అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు గడ్డం లుక్‌కు ఎక్కువగా నెగటివ్‌ మార్కులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఎప్పుడు నీట్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా గడ్డంతో కనిపిస్తే ఎవరైనా కాస్త వింతగా చూస్తారు. అయితే తెల్లటి మొహంపై గడ్డం ఉంటే మాత్రం ప్రేక్షకులు మహేష్‌బాబును స్వీకరించడం కాస్త కష్టమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మహేష్‌బాబు గడ్డం లుక్‌తో బాగానే ఉన్నట్లుగా అనిపిస్తున్నా కూడా, ఎక్కువ శాతం జనాలకు మాత్రం మహేష్‌బాబు గడ్డం లుక్‌ బాగాలేదని అంటున్నారు. తన 25వ చిత్రంలో కొత్తగా కనిపించాలని చూస్తున్న మహేష్‌బాబు ముందుగానే లుక్‌ను ఇలా రివీల్‌ చేయడం మంచి నిర్ణయం అని, లేదంటే డైరెక్ట్‌గా సినిమాలోనే ఇలా కనిపిస్తే ప్రేక్షకులు వెంటనే జీర్ణించుకోలేక పోతారు.

సినిమా షూటింగ్‌కు ముందే ఇలా లుక్‌ రివీల్‌ అవ్వడం వల్ల సినిమా విడుదల అయ్యే వరకు మహేష్‌బాబుకు అలవాటు పడతారు అని, అందుకే మహేష్‌బాబు ఇంత ముందుగానే తన గడ్డంతో మీడియా ముందుకు వచ్చి ఉంటాడు అంటున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్‌బాబును కొత్తగా చూపించబోతున్నాడు. మరి సినిమాను కొత్తగా చూపిస్తాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. త్వరలో సెట్స్‌ పైకి వెళ్లబోతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరంకు గాని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.