మహేష్‌ 25వ సినిమా ఎంత వరకు వచ్చింది?       2018-05-20   03:42:30  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 24వ చిత్రంగా ‘భరత్‌ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రతి హీరోకు కూడా తన 25 చిత్రం బెంచ్‌ మార్క్‌గా నిలుస్తుంది. అందుకే ఆ చిత్రం భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తారు. అలాగే మహేష్‌బాబు తన 25వ చిత్రం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్‌బాబు 25వ చిత్రంకు సంబంధించి కాస్త గందరగోళం నెలకొంది. మొదట మహేష్‌బాబు 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనుకున్నారు. కాని తాజాగా మహేష్‌ తన 25వ చిత్రం దర్శకుడు మారినట్లుగా తెలుస్తోంది.

‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు సుకుమార్‌ ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే అది మహేష్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతుందని ప్రకటించారు. కాని సుకుమార్‌తో 25వ చిత్రం అయితే బాగుంటుందని మహేష్‌ భావిస్తున్నాడు. ఎన్టీఆర్‌ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన సుకుమార్‌ ఆ సినిమాతో ఎన్టీఆర్‌కు మంచి సక్సెస్‌ను ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మహేష్‌బాబు తన 25వ చిత్రాన్ని సుకుమార్‌తో చేయాలని కోరుకుంటున్నాడు.

సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు మహేష్‌బాబు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు. అందుకే అదేదో ముందే చేసి, 26వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేయడంతో ఆ విధంగా ఆలోచించాడు. కాని మహేష్‌బాబు తాజాగా మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తాను ముందు నుండి అనుకుంటున్నట్లుగా, ఇప్పటికే ప్రకటించిన విధంగా తన 25వ చిత్రంను వంశీ పైడిపల్లితోనే చేయానే భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతా రెడీ అయిన సమయంలో 25వ చిత్రం దర్శకుడు మారితే ప్రేక్షకు మరియు సినీ వర్గాల వారు మహేష్‌బాబుపై తప్పుడు అభిప్రాయంను వ్యక్తం చేస్తారనే అనుమానంతో ఈ నిర్ణయంకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.

మహేష్‌బాబు, వంశీపైడిపల్లిల కాంబో మూవీ మరి కొన్ని రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాను దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇక సుకుమార్‌తో మహేష్‌బాబు మూవీని మైత్రి మూవీస్‌ వారు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్‌ 25వ చిత్రం ఈ సంవత్సరంలోనే విడుదల కానుండగా, 26వ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నారు.