మహానటి బడ్జెట్‌ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు       2018-05-10   00:17:30  IST  Raghu V

సావిత్రి జీవిత కథకు వెండి తెర రూపంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహానటి’కి అన్ని వర్గాల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాగ్‌ అశ్విన్‌ ఒక అద్బుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడని, సినిమా కోసం ఆయన పడ్డ కష్టం కనిపిస్తుందని సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. సినిమాలో భారీ తారాగణం కనిపించడంతో పాటు, అప్పటి కాలం నాటి భారీ సెట్టింగ్‌లు ఎన్నో వేయడం జరిగింది. దాంతో ఈ సినిమా బడ్జెట్‌ భారీగానే అయ్యి ఉంటుందని అంతా భావిస్తారు. కాని ఈ సినిమాకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పెట్టిన అసలు ఖర్చు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.

ఈ చిత్రంలో పలువురు నటీనటులు వారికి అప్పగించిన పాత్రలపై గౌరవంతో పారితోషికం తీసుకోకుండా చేయడం జరిగిందట. సినిమాలో ఎంతో మంది స్టార్స్‌ కనిపించినా వారిలో ఎక్కువ శాతం మంది మూడు నాలుగు రోజులు మాత్రమే ఈ సినిమా కోసం డేట్లు ఇచ్చారు. ఆ తక్కువ డేట్లకు పారితోషికం ఇవ్వలేదు. ఇక ముఖ్యంగా కీర్తి సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంతలకు ఎక్కువ పారితోషికం అయ్యింది. ఇక సెట్టింగ్స్‌ విషయంలో కూడా దర్శకుడు చాలా తెలివిగా ఆలోచించి ఒకే సెట్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సినిమాను చేయడం జరిగింది. దర్శకుడి ప్రతిభ మరియు నిర్మాతల తెలివితేటల కారణంగా ఈ చిత్రం కేవలం 30 కోట్ల లోపు బడ్జెట్‌తో పూర్తి అవ్వడం జరిగింది.

ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి 30 కోట్ల బడ్జెట్‌ అంటే కాస్త ఎక్కువ అని చెప్పుకోవాలి. అయితే మహానటి చిత్రం అవ్వడంతో ఆ మాత్రం పెట్టాల్సిందే అని దర్శకుడు భావించాడు. అప్పటి కాలంను గుర్తుకు తెచ్చే సెట్టింగ్‌లు వేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, అలా అని బ్లూ మ్యాట్‌ సీన్స్‌ చేయలేని పరిస్థితి. ఆ సమయంలోనే ఒక మంచి ఆర్ట్‌ డైరెక్టర్‌తో తక్కువ ఖర్చులో సెట్స్‌ను వేయించడం జరిగింది. అలా సినిమా మొత్తానికి కూడా 26 నుండి 28 కోట్ల మద్యలో పూర్తి చేశాడని, ప్రమోషన్స్‌ కోసం పెట్టిన ఖర్చుతో కలిపి మొత్తం 30 కోట్ల లోపే అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

‘మహానటి’పై వచ్చిన అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది. విడుదలకు ముందే ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా 20 కోట్ల వరకు రావచ్చు. ఇతర రైట్స్‌ ద్వారా మరో 10 కోట్ల వరకు వస్తాయి. థియేట్రికల్‌ రైట్స్‌ కాకుండానే ఇతర రైట్స్‌తో బడ్జెట్‌ రికవరీ అయ్యింది. అంటే థియేటర్ల నుండి వచ్చే మొత్తం కూడా లాభాలే. ఈ చిత్రంతో నిర్మాతలకు కనీసం 50 కోట్ల మేరకు లాభాలు ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.