మహానటి అనుభవం.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ వద్దు       2018-05-09   07:07:05  IST  Raghu V

ఈ మద్య కాలంలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా బయోపిక్‌ల సీజన్‌ నడుస్తుంది. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్‌, ఆటగాళ్లు ఇలా విభిన్న రంగాలకు చెందిన వారి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఆటో బయోపిక్‌ చిత్రాలు తెరకెక్కాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆటోబయోపిక్‌ల జోరు కొనసాగుతుంది. తాజాగా మహానటి అంటూ సావిత్రి జీవిత చరిత్రను తెర రూపం తీసుకు వచ్చారు. ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి, ఏయన్నార్‌ల జీవిత చరిత్రల ఆధారంగా కూడా సినిమాలు తెరకెక్కబోతున్నాయి.

ప్రముఖుల జీవిత చరిత్ర సినిమాలు తీయడం చాలా కష్టంగా ఉందని, వారి జీవితంలో అన్ని సంఘటనలు తెలియజేసేందుకు సినిమా నిడివి సరిపోదు. రెండు లేదా మూడు పార్ట్‌లుగా సినిమాను తీస్తే కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. అందుకే ప్రముఖుల జీవిత చరిత్ర సినిమాలు తీయడం కంటే ప్రైమ్‌ వీడియోల కోసం వెబ్‌ సిరీస్‌ను తీయడం మంచిది అంటూ ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

మహానటి ప్రమోషన్‌లో భాగంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. సావిత్రి జీవిత చరిత్ర అనుకున్నప్పుడు మాకు ఎన్నో విషయాలు తెలిశాయి. ఆ మొత్తం విషయాలను సినిమా రూపంలో తీసుకు రావడం అసాధ్యం. ఆ విషయం మాకు తెలుసు. అందుకే ముఖ్యమైన విషయాలను మాత్రమే ఏరి కోరి తీసుకున్నాం. అయినా కూడా సినిమా నిడివి నాలుగు గంటల వరకు వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు గంటలకు తగ్గించాం. పూర్తి స్థాయిలో ఈ మూడు గంటల వ్యవధిలో చూపించలేక పోయాం అని చెప్పుకోవచ్చు. అందుకే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి గొప్ప వారి జీవిత చరిత్రను సినిమా రూపంలో కాకుండా వెబ్‌ సిరీస్‌ల రూపంలో విడుదల చేస్తే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రకు రంగం సిద్దం అయిన విషయం తెల్సిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రంకు దర్శకుడు ఎంపిక చేసే పక్రియ జరుగుతుంది. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి అయ్యి సినిమా సెట్స్‌ పైకి వెళ్తుంది. సినిమా స్క్రిప్ట్‌ చాలా పెద్దగా వచ్చిందని, రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నట్లుగా బయోపిక్‌ను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తే ఖచ్చితంగా డాక్కుమెంటరీ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. అందుకే ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు పార్ట్‌ల నిర్ణయంను వెనక్కు తీసుకోవాలి. ఒక వేళ సినిమాను తీయాలని పట్టుదలగా ఉంటే ఒక పార్ట్‌ తీసి చూపించలేని విషయాలను వెబ్‌ సిరీస్‌గా విడుదల చేస్తే బాగుంటుంది.